ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయి ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉత్కంఠ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. పోలీసులు కోర్టు తీర్పు మేరకు చంచల్ గూడ జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. హైకోర్టు క్వాష్ పిటిషన్ విచారణ చేపట్టింది. దీంతో అల్లు అర్జున్ కి ఊరట లభించింది. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు.
ఈ ఘటన పై ఢిల్లీలో ఇండియాటుడే సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పుష్ప-2 బెనిఫిట్ షోకి మేమే అనుమతి ఇచ్చాం. సరైన ఏర్పాట్లు లేకుండా ఆయనే థియేటర్ కి వచ్చాడు. కారు ఎక్కి నమస్కారం చేస్తూ.. ర్యాలీ చేశారు. ఒక మహిళా చనిపోయింది. ఓ బాబు కోమాలో ఉన్నాడు. దీనిపై మేము కేసు నమోదు చేయకపోతే.. కేసు నమోదు చేయలేదని మమ్మల్ని అడగరా..? అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇందులో మా ప్రమేయం ఏమి లేదని తెలిపారు. అల్లు అర్జున్ భార్య కుటుంబం నాకు బంధువులే.. అల్లు అర్జున్ మామ చిరంజీవి, పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే అన్నారు. ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. అల్లు అర్జున్ సైలెంట్ గా సినిమా చూసి వెళ్తే ఎలాంటి సమస్య ఉండకపోయేది. ర్యాలీ వల్లనే సమస్య వచ్చిందని తెలిపారు.