కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ను అవమానించారంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై స్పందించారు. అంబేద్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టేందుకు షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగలను కించపరిచేందుకు కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసిందో ప్రజలందరూ చూశారని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు ప్రధాని మోడీ.
“కొన్నేళ్ల పాటు కాంగ్రెస్ సాగించిన అరాచకాలు.. అంబేద్కర్ ను అవమానించిన తీరును ఇప్పుడు చెప్పే అబద్దాలతో వారు దాచలేరు. అలా అనుకుంటే వారు పెద్ద పొరపాటు చేసినట్టే. ఎస్సీ, ఎస్టీ వర్గాలను కించ పరిచేందుకు రాజవంశం నేతృత్వంలోని ఒక పార్టీ చేసిన ప్రయత్నాలను దేశ ప్రజలందరూ చూశారు. మనం ఇలా ఉండడానికి అంబేద్కరే కారణం. గత దశాబ్ద కాలంగా ఆయన ఆశయాన్ని నెరవేర్చేందుకు మా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేసింది. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చాం. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేయడం, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన వంటి ప్రధాన కార్యక్రమాలు ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడ్డాయి” అంటూ మోడీ పేర్కొన్నారు.