ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మందుబాబులకు మరో శుభవార్త చెప్పింది. ఈ మేరకు త్వరలో మరోసారి మద్యం ధరలను తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 మద్యం తయారు చేసే కంపెనీలు ఉండగా.. వాటంతట అవే వాటి బేసిక్ ప్రైజ్ ని తగ్గించాయి. అదేవిధంగా రాష్ట్ర బెవరేజస్ సంస్థ ఆయా కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేసే ధర కూడా తగ్గించడంతో మరోసారి మద్యం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
తాజా నిర్ణయంతో ఒక్కో క్వార్టర్ ఎమ్మార్పీపై రూ.30 వరకు తగ్గే చాన్స్ ఉంది. కాగా, వైసీపీ ప్రభుత్వం హయాంలో నాసిరకం మద్యం, ధరలను ఇష్టానుసారంగా పెంచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, రాష్ట్రంలో అనూహ్యంగా ప్రభుత్వం మారడంతో కూటమి సర్కార్ కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మద్యం సరఫరా కంపెనీలు వాటంతట అవే తమ బేసిక్ ప్రైస్ ను తగ్గిస్తుండటంతో మద్యం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉన్న క్రమంలో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు.