రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉద్యోగాల కోసం వేలాది మంది నిరుద్యోగ యువత ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను హైదరాబాద్ లోని అశోక్ నగరలో తినతినడికి తిండిలేక పస్తులుంటూ ఒక్కపూట భోజనమే తింటూ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్లను ఎంతో మందిని చూశానన్నారు. ఈ తరుణంలో మోదీ ప్రభుత్వం కేంద్ర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండటం హర్షణీయమన్నారు.
10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని గతంలో ప్రధానమంత్రి మోదీ మాట ఇచ్చారని, దానికి కట్టుబడి నేటి వరకు ‘రోజ్ గార్ మేళా’ పేరుతో 9.25 లక్షల మందిని నియామక పత్రాలను అందజేశామన్నారు. ఈ ఒక్కరోజే దేశవ్యాప్తంగా 71 వేల మందికి నియామక పత్రాలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు హైదరాబాద్ లోని హకీంపేట నేషనల్ ఇండస్ట్రీయల్ అకాడమీలోని అంతరిక్ష కేంద్రం ఆడిటోరియంలో నిర్వహించిన ‘రోజ్ గార్ ’’ మేళా కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.