ఈ భూమి మీద అత్యంత తెలివైన జీవి మనిషి. తెలివైనవాడు కాబట్టే అడవిలో నుండి బయటకు వచ్చాడు, ఇల్లు కట్టుకున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, వంట చేసుకోగలుగుతున్నాడు, నాగరిక ప్రపంచంలో బతుకుతున్నాడు.
మనిషికి తెలివి లేకపోతే ఇప్పటికీ అడవిలోనే ఉండేవాడు. భూమ్మీద మనిషి తర్వాత తెలివైన కొన్ని జంతువులు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
డాల్ఫిన్స్:
సముద్ర జీవులైన డాల్ఫిన్లు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. వీటికి తెలివి కూడా ఎక్కువే, ఇవి ఒకదానితో ఒకటి సంభాషించుకోగలుగుతాయి. డాల్ఫిన్లు విజిల్స్ ద్వారా మాట్లాడుకుంటాయి. అంతేకాదు ఇవి ఇతరులను అనుకరించడంలో ముందుంటాయి. వీటికి నేర్చుకునే గుణం ఎక్కువ.
చింపాంజీలు:
గత కొన్ని రోజులుగా భూమి మీద చింపాంజీలు తగ్గిపోతూ వస్తున్నాయి. ఇవి చాలా తెలివైనవి. సమస్యలను పరిష్కరించడంలో ఇవి ముందుంటాయి. అద్దంలో ఇవి తమను తాము గుర్తుపట్టే శక్తిని కలిగి ఉన్నాయి.
ఒరంగుటాన్:
ఈ రకం కోతులు చాలా తెలివైనవి. ఇవి అడవుల్లో ఆయుధాలను ఉపయోగించే సామర్థ్యం కలవి. ఈ కోతుల పిల్లలు సైతం అడవుల్లో ఆయుధాలను ఉపయోగిస్తూ కనిపిస్తుంటాయని ఒకానొక అధ్యయనంలో వెల్లడయ్యింది. ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకునే సామర్థ్యం వీటికి ఉంది.
ఏనుగు:
ఏనుగులు అనగానే భారీ శరీరం గుర్తొస్తుంది. ఏనుగులకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. ఏనుగులు మూత్రం వాసన ద్వారా వాటి బంధు ఏనుగులను గుర్తుపడతాయి. దాదాపు ముప్పై ఏనుగులను మూత్రం వాసన ద్వారా ఇవి గుర్తుపట్టగలవు.
కాకి:
కాకులు ఎమోషనల్ గా ఉంటాయి. వీటికి భావావేశాలు ఎక్కువ. అందుకే వీధిలో ఏదైనా కాకి చనిపోతే కావ్ కావ్ మంటూ ఏడుస్తాయి. కాకులకు ఇతరుల ముఖాల్ని గుర్తుపెట్టుకునే శక్తి ఉంది.