రాష్ట్ర రైతాంగానికి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఏడాది పాలనలో రైతు ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో 9 మందితో కూడిన అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 400కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇది ఆందోళనకర పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన రైతు రుణమాఫీ కనీసం 30 శాతాన్ని కూడా దాటకపోవడం, గతంలో అందిన రైతుబంధును ఆపివేయడం, ఇస్తామన్న 15 వేల రూపాయల రైతు భరోసా సైతం రద్దు చేయడం వంటి ముఖ్యమైన ఆర్థిక సమస్యలు రైతు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని తెలిపారు.
వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా, సకాలంలో సాగునీటి వసతి కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ కారణంగా రైతులు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిందని కేటీఆర్ విమర్శించారు. రైతన్నలను, వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకుండా దిక్కులు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేసేలా ప్రధాన ప్రతిపక్షంగా తమ వంతు పాత్ర పోషించాలన్న ఉద్దేశంతో ఈ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు.