తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనపై ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి 8న తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందగా.. పలువురు భక్తులు గాయపడిన విషయం తెలిసిందే.
ఈ ఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా పరిగణించారు. ఘటన జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. ఘటన జరిగిన తీరుపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు.. న్యాయ విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు. ఈ మేరకు తాజాగా జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.