స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ఇంకెంతకాలం జాప్యం చేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో స్పష్టంగా పేర్కొని ఇప్పుడు ఏడాది గడిచినా రిజర్వేషన్ల పెంపునకు అతీగతీ లేదని మండి పడ్డారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కవిత.. అశాస్త్రీయంగా బీసీ గణన నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్ పేరిట కాలయాప చేయడమే మీ ఆలోచనగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు.
కులగణన పూర్తయి కూడా చాలా కాలం అవుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ వివరాలు బహిర్గతం చేయలేదని మరో వైపు డెడికేటెడ్ కమిషన్ నివేదిక సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నా తదిపరి కార్యా చరణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్నారు. బీసీల అంశాల పట్ల మీ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోంది? బీసీలంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చులకన అని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంపును విస్మరిస్తే ఊరుకోయేది లేదని కుంటిసాకులతో ఇచ్చిన హామీ కంటే తక్కువ రిజర్వేషన్లు కల్పిస్తే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదన్నారు.