సీఎం రేవంత్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కర్ర సహాయం లేకుండా నిలబడాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నేడు పరిగి నియోజకవర్గంలోని దాస్యనాయక్ తండాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కెసిఆర్ కట్టె లేకుండా నడుచుడు కాదు.. నీకు చేతనైతే కమిషన్లు లేకుండా ప్రభుత్వాన్ని నడపాలని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. కెసిఆర్ దెబ్బ ఎట్ల ఉంటదో నీ పాత గురువును అడుగు.. మీ రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మను అడుగు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
71 సంవత్సరాల ఒక పెద్ద మనిషిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ నిలబడడమే కాదు.. తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి నాలుగు కోట్ల మంది ప్రజలను దేశం ముందు సమోన్నతంగా నిలబెట్టాడని అన్నారు. కెసిఆర్ కొడితే ఎలా ఉంటుందో ఆ దెబ్బ తిన్న వాళ్లని రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకోవాలన్నారు.