గ్రాడ్యుయేట్స్, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 7 మండలాల అధ్యక్షులు, గ్రామాల అధ్యక్షులు ఇతర ముఖ్య నేతలు పట్టభద్రుల ఆత్మీయ సమ్మెళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏఐసీసీ కార్యదర్శి పి.విశ్వనాథన్ హాజరయ్యారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్- కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంతో పాటు ఇదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ బలపరిచిన నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని గ్రాడ్యుయేట్స్ ని కోరారు.
ఏ ఒక్క ఓటు మిస్ కావద్దని.. అన్ని ఓట్లు మన అభ్యర్థికే ప్రథమ ప్రాధాన్యతగా పడాలని అభ్యర్థించారు. గ్రామాల వారిగా పట్టభద్రుల ఓట్లు ఎన్నిసాధిస్తారు. ఎలా వారిని ఓటు వేయించాలి తదితర వాటిపై సమావేశంలో అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్తితి బాగా లేకున్నా గత పథకాలతో పాటు కొత్త పథకాలను కొనసాగిస్తున్నామని పొన్నం స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించడంలో చిత్తశుద్ధి తో పని చేస్తున్నామన్నారు.