అంబర్పేట ఫ్లై ఓవర్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 6 నంబర్ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ కింద నిర్మాణ సామగ్రి ఉన్న షెడ్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పొగ కారణంగా ఫ్లై ఓవర్ మీద, కింద నుంచి ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.