అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2025 సందర్భంగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత జ్యోతి ప్రజ్వలన చేసి మహిళ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్యానెల్ డిస్కషన్లో పాల్గొన్న హొంమంత్రి.. మహిళల నాయకత్వం-సవాళ్లు, పురోగమించే మార్గాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనేక అవమానాలు అధిగమించి ఓ సాధారణ గృహిణి నుంచి హోం మినిస్టర్ స్థాయికి చేరడంలో సీఎం చంద్రబాబు సహా ఎంతో మంది సహకారం ఉందన్నారు.
ఆడపిల్లవి జాగ్రత్త అనే చెప్పే బదులు మగపిల్లాడికి జాగ్రత్తలు చెప్పి బయటకు పంపే రోజులు
రావాలని కోరారు. దివంగత నందమూరి తారక రామారావు, సీఎం చంద్రబాబు పాలనలో మహిళా సాధికారత, వికాసం, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ముఖ్యంగా అందరికీ ఉపాధి కల్పించే విధంగా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నట్టు తెలిపారు హోం మంత్రి అనిత.