దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని కోఠీలో చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి గొప్ప కీర్తి లభిస్తోందని ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో చాకలి ఐలమ్మ యూనివర్సిటీ పోటీ పడాలని విద్యార్థులు, ప్రొఫెసర్లకు ఆయన పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో మహిళా యూనివర్సిటీ విద్యార్థులు రాణించి దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కన్న కలలను నిజం చేయాలని అన్నారు.
ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషను కల్పించే సందర్భం వస్తుందని.. అందులోనూ విద్యార్థుల ప్రతినిధ్యం ఉండాలని తాను బలంగా కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ఏ రంగంలోనైనా మహిళలకు అవకాశం ఇస్తే.. తమ చిత్తశుద్ధిని నిరూపించుకుని దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో చదువుకోవడం ఇక్కడి విద్యార్థుల అదృష్టమని అన్నారు. అశేష తెలంగాణ ఆడబిడ్డలకు అన్నగా.. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేలా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించి వారికి పాఠశాలల నిర్వహణ బాధ్యతను అప్పగించామని గురు చేశారు.