గుంటూరు కు చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. కానీ గడువు సమయానికి లొంగిపోయేందుకు బోరుగడ్డ జైలుకు రాలేదు. దీంతో జైలు అధికారులు ఏపీ హైకోర్టుకు సమాచారం అందించారు. బోరుగడ్డ వ్యవహార శైలి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కి కూడా జైలు అధికారులు సమాచారం ఇచ్చారు. బెయిల్ పొందే సమయంలో బోరుగడ్డకు పూచికత్తుగా ఉన్న వారి వివరాలను జైలు అధికారులు పోలీసులకు సమర్పించారు.
బోరుగడ్డ రాజమహేంద్రవరం కారాగారంలో లొంగిపోతాడా..? లేదా అనే దానిపై గత కొద్ది రోజులుగా ఉత్కంఠ నెలకొంది. అనిల్ తన తల్లికి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించాలని గుంటూరు లలితా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ పీవీ రాఘవశర్మ సిఫారసు చేసినట్టు నకిలీ మెడికల్ సర్టిఫికేట్ కోర్టుకు సమర్పించి ఈనెల01న మధ్యంతర బెయిల్ గడువును పొడగించుకున్నట్టు పోలీసుల పరిశీలనలో వెల్లడి అయింది. అతనికి మెడికల్ సర్టిఫికెట్ తాము ఇవ్వలేదని ఆసుపత్రి వైద్యుడు రాఘవ శర్మ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు అనిల్ పై పట్టాభిపురం స్టేషన్ లో పీటీ వారంట్ పెండింగ్ ఉంది. ఈ తరుణంలోనే కస్టడీలోకి తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.