పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకంలో అనర్హులను గుర్తించేందుకు కేంద్ర సర్కార్ అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు అనర్హుల నుంచి రూ.416 కోట్లు రికవరీ చేసినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఆధార్, ఆదాయపన్ను శాఖ, ఆర్థిక మంత్రిత్వశాఖల వద్ద ఉన్న సమాచారంతో అనర్హులను గుర్తించే కార్యక్రమం చేపట్టినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, చట్టబద్ధ పదవుల్లో ఉన్నవారు ఈ పథకం కింద లబ్ధి పొందితే వారి నుంచి రికవరీ చేయాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రికవరీ కార్యక్రమం చేపట్టి ఇప్పటి వరకు రూ.416 కోట్లు రికవరీ చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఇక ఈ పథకం ద్వారా లబ్ధిపొందే రైతుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు.