బీజేపీలో పలువురు నాయకులు సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇలాంటి నేతలపై పార్టీ హైకమాండ్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు వేసింది. పార్టీతో పాటు మాజీ సీఎం యడియూరప్పకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్‌ను ఆ పార్టీ ఆరేళ్ల పాటు బహిష్కరించింది.
ఆరేళ్ల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించినట్లు బీజేపీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందంటూ ఎమ్మెల్యేకు లేఖ రాసింది. అయితే తనను పార్టీ నుంచి తనను బహిష్కరించడంపై ఎమ్మెల్యే బసనగౌడ స్పందిస్తూ ఎక్స్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు. వారసత్వ రాజకీయాలు, అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, వ్యక్తుల ఆధిపత్యాన్ని తొలగించాలని, ఉత్తర కర్ణాటకను అభివృద్ధి చేయాలని అడిగినందుకు తనను బహిష్కరించారని ఆయన ఆరోపించారు. మాట్లాడినందుకు ఇది పార్టీ తనకు ఇచ్చిన రివార్డు అంటూ ఎక్స్ లో పోస్టు పెట్టారు.