జాలీగా వీకెండ్ సమయంలో కుటుంబంతోనో, స్నేహితులతోనో హోటళ్లు, రెస్టారెంట్లలో తినేందుకు వెళ్తుంటారు చాలా మంది. అయితే తమకు ఇష్టమైన డిషెస్ ఆర్డర్ ఇచ్చి భోజనం చేసిన తర్వాత హోటల్ వాళ్లు ఇచ్చే బిల్లు చూసి చాలాసార్లు కస్టమర్ల కళ్లు గిర్రున తిరుగుతుంటాయి. తిన్న దాని కంటే ఎక్కువ సర్వీస్ ఛార్జీలు, ఇతర ట్యాక్స్ లు వేస్తుంటారు. చివరకు ఇంట్లోనే తింటే బాగుండేదని కస్టమర్లకు అనిపించేలా చేస్తారు.
ఈ నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార బిల్లులపై సేవా రుసుము (సర్వీసు ఛార్జీ) వసూలు చేయడంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బిల్లుపై సర్వీసు ఛార్జీని వినియోగదారులు స్వచ్ఛందంగా చెల్లిస్తే తీసుకోవాలే తప్ప, రెస్టారెంట్లు/హోటళ్లు నిర్బంధంగా వసూలు చేయొద్దని పేర్కొంది. ఫుడ్ బిల్లులపై సర్వీస్ ఛార్జీలను హోటళ్లు నిర్బంధంగా వసూలు చేయకూడదంటూ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) జారీ చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ రెస్టారెంట్ల సంఘాలు దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ వాటిపై విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎం.సింగ్ ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.