మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ ఫిర్యాదుతో అతడిని మంగళగిరి పోలీసులు గురువారం రోజున అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఇవాళ కిరణ్ ను పోలీసులు మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు. తొలుత మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో అతడికి ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టుకు తరలించారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు కోర్టు వద్ద మోహరించారు.
ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో వై.ఎస్.భారతిని ఉద్దేశించి కిరణ్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన టీడీపీ హైకమాండ్ అతడిపై చర్యలకు ఉపక్రమించింది. వెంటనే అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆ వెంటనే మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్‌లో కిరణ్‌పై బెయిల్‌కు వీల్లేని కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.