భూభారతి అమలుపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి పోర్టలు రేపు జాతికి అంకితం చేయబోతున్నట్లు తెలిపారు. సామాన్య రైతుకు కూడా అర్ధమయ్యేలా భూభారతిని రూపొందించాలని అధికారులకు సూచించారు. భూభారతి తాత్కాలికం కాదని.. కనీసం వంద సంవత్సరాల పాటు ఉంటుందని అన్నారు. భూభారతి వెబ్సైట్ సైతం అత్యాధునికంగా ఉండాలని తెలిపారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. భూభారతి నిర్వహణ విశ్వసనీయత సంస్థకు అప్పగించాలని చెప్పారు.
భూభారతి పోర్టల్ పై ప్రతి మండలంలో అవగాహన సదస్సు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధరణి పోర్టల్ స్థానంలో తీసుకురానున్న భూభారతిని ఈ నెల 14 నుంచి అమలు చేయనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 3 మండలాల్లో తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఈ పోర్టల్ను అందుబాటలోకి తీసుకురానుంది. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు సీఎం తెలిపారు.