ఇప్పటి వరకు చైనాకు మాత్రమే పరిమితం అయిన కరోనా వైరస్ ఇప్పుడు హైదరాబాద్ ని కూడా పలకరించడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. దుబాయ్ నుంచి వచ్చిన ఒక రోగికి కరోనా వైరస్ ఉందని వైద్యులు గుర్తించారు. ఈ నేపధ్యంలో సాయంత్రం మీడియాతో మాట్లాడారు తెలంగాణా ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు.
అతడికి గాంధీ ఆస్పత్రిలో ఐసోలేటెడ్ వార్డులో చికిత్స అందిస్తున్నామన్న ఆయన… ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అసవరం లేదని, మన వాతావరణ పరిస్థితుల్లో ఆ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదని మంత్రి సూచించారు. తమ్ములు, దగ్గు, జ్వరం ఉంటే ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలని బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్‌లు ధరించాలని ప్రజలకు సూచించారు.
హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడని, కంపెనీ పని మీద ఫిబ్రవరి 15న దుబాయ్‌కి వెళ్లాడని, అక్కడ నాలుగైదు రోజుల పాటు హాంగ్‌కాంగ్‌కు చెందిన వ్యక్తులతో కలిసి పనిచేశాడని మంత్రి వివరించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 20న బెంగళూరుకు వచ్చాడని, అనంతరం బస్సులో ప్రయాణించి ఫిబ్రవరి 22న హైదరాబాద్‌కు చేరుకున్నాడన్నారు.
జ్వరం రావడంతో సికింద్రాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి ఔట్ పేషెంట్‌గా వెళ్లాడని వివరించారు. ఫిబ్రవరి 27న అక్కడ అడ్మిట్ అయ్యాడని, టెస్టుల తర్వాత అనుమానం రావడంతో, గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారన్నారు. ఈ నేపథ్యంలో మార్చ్ 1న సాయంత్రం 5 గంటలకు అతడు గాంధీ ఆస్పత్రిలో చేరాడు, శాంపిల్స్‌ను పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తే కోవిడ్-19 సోకినట్లు నిర్ధారించారన్నారు.
ఈ విషయాన్ని కేంద్రంతో పాటు సీఎం కేసీఆర్‌కు వివరించామని బెంగళూరుకు వచ్చిన తర్వాత, ఆ యువకుడు ఎవరెవరిని కలిశాడో వారి వివరాలు సేకరించారని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 80 మందిని గుర్తించారని.. రోగితో పాటు బస్సులో ప్రయాణించిన 27 మంది, అపోలో ఆస్పత్రిలో చికిత్స సందర్భంగా అతడిని కలిసిన 23 మంది సిబ్బంది, అతడి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించనున్నారని మంత్రి వివరించారు.
గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక ఫ్లోర్‌లో ఐసోలేటెడ్ వార్డులో రోగికి చికిత్స అందిస్తున్నారన్నారు. ఆ వార్డుకు ఎవరినీ అనుమతించడం లేదని అన్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, గాంధీ, చెస్ట్, ఫీవర్ ఆస్పత్రుల్లో 40 పడకలతో కూడి ఐసోలేటెడ్ వార్డులు ఏర్పాటు చేశామని, ఆయన మీడియా తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.