ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై వారితో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. ముఖ్యంగా రాజ్యసభ ఉపఎన్నికలపై చర్చించినట్లు తెలిసింది.
ఏపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్ఖానాన్ని భర్తీ చేసే అంశంపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. నామినేషన్ దాఖలుకు ఈ నెల 29వ తేదీ తుది గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభకు ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఇప్పటి వరకు వైఎస్సార్సీపీకి చెందిన నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా మూడింటిన భర్తీ చేశారు. మిగిలిన స్థానంపై అమిత్ షాతో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం.