బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై బీఆర్ఎస్ నేతలు రైతులకు ఉపయోగపడుతుందని పేర్కొంటుంటే.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం కేసీఆర్ కుటుంబం కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని పేర్కొంటున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని వెలగబెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల రీ డిజైన్ల పేరుతో కోట్లాది రూపాయలను ప్రభుత్వం దోచుకుందని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కత త్వరలోనే అందరికీ తెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ భారత్ సమ్మిట్ లో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ నాసిరకమైన ప్రాజెక్ట్ అని తెలిపారు. తెలివి ఉన్నవాడు ఎవ్వడూ ఆ ప్రాజెక్ట్ ని నిర్మించి ఉండేవారు కాదని పేర్కొన్నారు. NDSA రిపోర్టులోని అంశాలను తాము ఇంకా బయటపెట్టలేదని.. బీఆర్ఎస్ వాల్లే బయటికీ పెట్టుకుంటున్నారంటూ సెటైర్లు వేశారు. ఒకవేళ తమ్మిడిహట్టి ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తే.. ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందోనని పదేల్లపాటు ఆ ప్రాజెక్ట్ ని పట్టించుకోకుండా పడావు పెట్టారని ఆరోపించారు.