శాంతి చర్చలకు సిద్ధం అని మావోయిస్టులు పదే పదే ప్రతిపాదిస్తున్నప్పటికీ ఛతీస్ ఘడ్ సరిహద్దులోని కర్రెగుట్టలో కూంబింగ్ నిర్వహించడం సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తక్షణమే కర్రెగుట్ట అడవుల్లో కూంబింగ్ నిలిపివేయాలని, మావోయిస్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలకు అంగీకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. వేలాది మంది సాయుధ బలగాలు చుట్టుముట్టి మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా మారణహోమం చేయడం సరైన చర్య కాదన్నారు.
అణచివేత ఒక్కటే మార్గం కాదని.. వాటిని చర్చల ద్వారా పరిష్కరించాలని కోరారు. తాము శాంతి చర్చలకు సిద్దమని మావోయిస్టులు మరోసారి చేసిన ప్రతిపాదనను పెడచెవిన పెట్టడం శ్రేయస్కరం కాదని సూచించారు. ఇప్పటికే మావోయిస్టులు పదుల సంఖ్యలో హతమైనట్టు వార్తలు వస్తున్నాయని.. అలాగే పదుల సంఖ్యలో సాయుధ బలగాలు వడదెబ్బకు గురైనట్టు సమాచారం వస్తుందని.. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు కూనంనేని.