పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్–పాకిస్థాన్ సంబంధాలు మరింత ఉద్విగ్నంగా మారాయి. ఈ నేపథ్యంలో మే 7న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్ సమావేశం జరగనుంది. సరిహద్దు భద్రత, పాక్‌పై ప్రతిచర్యలతో పాటు దేశవ్యాప్తంగా ప్రాధాన్యమైన విషయాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో మోదీ 48 గంటల్లో రెండు సార్లు సమావేశమైన సంగతి తెలిసిందే. అందుకు కొనసాగింపుగానే ఈ కేబినెట్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. ఉగ్రదాడి తర్వాత దేశం లోపల బయట పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అనేక దేశాలు కళ్లుపట్టాయి.
ఈ సమావేశంలో పాక్‌పై వ్యూహాత్మక ప్రతిస్పందనలపై మంతనాలు సాగనున్నాయి. ముఖ్యంగా పాక్ వాయుసేన దాడులకు ఎదురయ్యే పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, అత్యవసర సేవలు, సివిలియన్ భద్రత, కీలక ప్రాజెక్టులు, ప్రజల్ని హుటాహుటిన తరలించే మార్గాలు వంటి అంశాలు చర్చించనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, అజిత్ దోవల్‌లతో సుమారు మూడు కీలక భేటీలు నిర్వహించారు. ఈ భద్రతా పరిణామాల మధ్య సీసీఎస్ (కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ) కొన్ని కీలక నిర్ణయాలను ఇప్పటికే తీసుకుంది. అందులో భాగంగా సింధు జలాల ఒప్పందంపై ఆంక్షలు, పాక్‌తో డిప్లొమాటిక్ సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాక్ పౌరుల వీసాలు రద్దు, గగనతలాన్ని మూసివేత వంటి దూకుడు చర్యలు ఉన్నాయి.