ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కాబోతున్న తరుణంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు తీరని లోటు ఎదురవుతుంది. జట్టు ప్రధాన బౌలర్ అయిన ఆస్ట్రేలియన్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ మిగతా టోర్నమెంట్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. భుజానికి గాయం కారణంగా ఇప్పటికే స్వదేశమైన ఆస్ట్రేలియాకు వెళ్లిన హేజిల్‌వుడ్, తిరిగి భారత్‌కు రానని సమాచారం. ఇది ఆర్సీబీ బౌలింగ్ దళానికి గట్టి ఎదురుదెబ్బగా మారనుంది. ఈ సీజన్‌లో హేజిల్‌వుడ్ 10 మ్యాచుల్లో 18 వికెట్లు సాధించి, అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో మూడవ స్థానంలో నిలిచాడు. మే 3న చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆయన గాయంతో ఆడలేదు. తర్వాతి మ్యాచ్‌ల్లోనూ అందుబాటులో ఉండకపోవడం పైనే ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఇదిలా ఉండగా, దక్షిణాఫ్రికాతో టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ సమీపిస్తున్న నేపథ్యంలో హేజిల్‌వుడ్ పూర్తి ఆరోగ్యంతో ఉండేలా ఆస్ట్రేలియా బోర్డు జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఇక భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 వారం పాటు వాయిదా పడింది. దీనితో, చాలా మంది విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు తిరిగిపోగా, కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన వెంటనే మే 15 లేదా 16 నాటికి టోర్నీ తిరిగి ప్రారంభం కానుందని తెలుస్తోంది. బీసీసీఐ ఇప్పటికే ఫ్రాంచైజీలకు మే 13 నాటికి అందరూ జట్టుతో చేరాలని సూచనలు ఇచ్చింది. త్వరలో కొత్త షెడ్యూల్ వెల్లడికానుంది. ఇక టోర్నీ ఆగే ముందు ఆర్సీబీ బలంగా కనిపించింది. 11 మ్యాచ్‌లలో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించిన ఆర్సీబీ, ప్లేఆఫ్స్‌కు చేరువైన జట్లలో ఒకటిగా నిలిచింది. ప్లేఆఫ్స్ బెర్త్ దాదాపుగా ఖాయమైంది.