ఆంధ్రప్రదేశ్ లో కరోనా విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇక అక్కడి ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇక రాజకీయ పార్టీలు కూడా కరోనా వైరస్ విషయంలో ఇప్పుడు చాలా చర్యలు తీసుకుంటున్నాయి. విపక్ష టీడీపీ ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది.
ఇదిలా ఉంటే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన ఇప్పటికే పార్టీ నేతలకు, కార్యకర్తలకు కీలక సూచనలు చేసారు. అటు ప్రభుత్వం తీసుకునే చర్యలను ఆయన విమర్శించారు. తాజాగా తమ పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యవసరమైతే తప్ప జిల్లాల నుంచి నాయకులు,
కార్యకర్తలు రావొద్దని టీడీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. పార్టీ కార్యాలయానికి వస్తున్న చంద్రబాబు సహా అందరికి థర్మల్ స్కానింగ్ చేయాలని, 100 డిగ్రీల శరీర ఉష్ణోగ్రత నమోదైన వారిని పార్టీ కార్యాలయంలోకి అనుమతించరాదని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎవరినైనా అయినా సరే స్కానింగ్ తర్వాతే కార్యాలయం లోపలికి అనుమతించాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. దీనితో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.