కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ దేశాలపై ఎలా ఉందో అందరికీ తెలిసిందే. కరోనా వల్ల అనేక దేశాల్లో లాక్ డౌన్ పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు. ఇక అమెరికాలో కరోనా వల్ల అందరికీ తీవ్ర నష్టం కలుగుతోంది. అలాగే ఉద్యోగులు పెరిగిన ఖర్చులతో సతమతమవుతున్నారు. అయితే అమెరికాలోని ఓ కంపెనీ మాత్రం ఉద్యోగులకు 2 వారాలా జీతాన్ని బోనస్‌గా ఇస్తున్నట్లు ప్రకటించింది.
అమెరికాలోని వర్క్‌డే ఫైనాన్షియల్ అనే కంపెనీ తమ ఉద్యోగులకు 2 వారాల జీతాన్ని బోనస్‌గా ఇస్తున్నట్లు తెలిపింది. కరోనా వైరస్ కారణంగా పెరిగిన ధరలు, ఇతర ఇబ్బందులను అధిగమించడానికి జీతాన్ని బోనస్‌గా ఇస్తున్నామని ఆ కంపెనీ తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో పలు సేవలను నిలిపివేశారని, ఇలాంటి స్థితిలో తమ ఉద్యోగులకు ఆర్థికంగా కొంత సహాయం అవసరమని తాము భావించామని, అందుకనే ఉద్యోగులకు జీతాన్ని బోనస్‌గా అందజేస్తున్నామని ఆ కంపెనీ తెలియజేసింది.
ఇక ఆ కంపెనీ బోనస్ కోసం కొంత అదనపు నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే పెయిడ్ లీవ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. కాగా 2005లో వర్క్‌డే సంస్థను ప్రారంభించగా ఈ కంపెనీ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్, ప్లానింగ్, అనలిటిక్స్ అప్లికేషన్స్ తదితర సేవలను అందిస్తోంది. ఇక అమెరికాలో ఇప్పటి వరకు 4500 మందికి కరోనా సోకగా, 88 మంది మృతి చెందారు.