క్వారంటైన్‌ రూల్ అతిక్రమించిన మేరీకోమ్

-

ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి, రాజ్యసభ సభ్యురాలు మేరీకోమ్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల విదేశాల నుంచి తిరిగివచ్చిన మేరీకోమ్ 14 రోజుల సెల్ఫ్ క్వారంటైన్ నిబంధనను ఉల్లంఘించారు. దీంతో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. జోర్డాన్‌లోని అమ్మాన్‌లో జరిగిన ఆసియా-ఓసియానా ఒలంపిక్ క్వాలిఫయర్స్‌లో పాల్గొన్న మేరీకోమ్ మార్చి 13న ఇండియా చేరుకున్నారు. కరోనా ఆందోళనల నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చినందున మేరీకోమ్ 14 రోజుల పాటు అంటే మార్చి 27 వరకు స్వీయ నిర్బంధంలో ఉండాల్సి ఉంది.

అయితే ఆమె ఆ నిబంధనను అతిక్రమించారు. మార్చి 18న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన అల్పహార విందుకు ఎంపీ హోదాలో మేరీకోమ్ హాజరయ్యారు. దీంతో ఆమె సెల్ఫ్ క్వారంటైన్ నిబంధన ఉల్లంఘించినట్టయింది. అదే విందుకు కరోనా పాజిటివ్‌గా తేలిన సింగర్ కనికా కపూర్‌తో కలిసి పార్టీలో పాల్గొన్న రాజస్తాన్ మాజీ సీఎం వసుంధరా రాజే కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ కూడా హాజరయ్యారు. దీంతో పలువురి ఎంపీలు ఆందోళన చెందుతున్నారు.

దీనిపై మేరీకోమ్ స్పందిస్తూ.. “జోర్డాన్ నుంచి తిరిగొచ్చాక నేను ఇంటికే పరిమితమయ్యాను. కేవలం రాష్ట్రపతి ఇచ్చిన విందుకు మాత్రమే హాజరయ్యాను. అక్కడ నేను దుష్యంత్‌ను కలవడం గానీ, అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వడం గానీ జరగలేదు” అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news