“నాళాల ఆక్రమణలను తొలగిస్తాం.. బాధితులకు టిడ్కో ఇళ్లు ఇస్తాం” అని ఏపీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇవాళ విజయవాడలో పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, వీఎంసీ ఇంజినీర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా నగరంలో ఔట్ ఫాల్ డ్రైన్లు, ఇతర డ్రైనేజీ వ్యవస్థను ఆయన పరిశీలించారు. అనంతరం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రూ.500 కోట్లతో పనులను 2014-19 మధ్య ప్రారంభించామని తెలిపారు.
కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పనులను నిలిపివేసింది అని ఆయన ఆరోపించారు. 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని గతంలో పనులను ప్రారంభించామని తెలిపారు. డ్రైన్స్ కి అడ్డంగా నిర్మించిన ఇళ్లను తొలగించి.. టిడ్కో ఇళ్లు ఇచ్చేటట్టు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఆగస్టు నెలలో టెండర్లు పిలిచి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఆరు నెలల్లో డ్రైన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని వెల్లడించారు మంత్రి నారాయణ.