ఉగ్రవాదానికి సపోర్టు ఇస్తున్న పాకిస్థాన్‌కు ఆపరేషన్ సింధూర్‌తో స్పష్టమైన సందేశం ఇచ్చామని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. కార్గిల్ యుద్ధ సంస్మరణం సందర్భంగా ద్రాస్‌లో జరిగిన విజయ్ దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్థాన్‌కు సందేశం ఇచ్చామని, అలాగే పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్య అని ఆయన పేర్కొన్నారు. పెహల్గామ్ ఉగ్రదాడి భారత్‌కు తీవ్ర గాయాన్ని ఏర్పర్చిందని.. అయితే ఈసారి ఇండియా బాధపడడమే కాదు, ఆ చర్యకు ప్రతీకార చర్యను కూడా చూపించిందన్నారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదన్న సందేశాన్ని ఇచ్చామన్నారు.
కార్గిల్ యుద్ధ వీరులను స్మరించేందుకు మూడు ప్రాజెక్టులను ఆర్మీ చీఫ్ ప్రారంభించారు. అమరులకు నివాళి అర్పించేందుకు ఈ-శ్రద్ధాంజలి పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు. 1999 నాటి కార్గిల్ యుద్ధ గాధలు వినేందుకు క్యూఆర్ కోడ్ ఆడియో గేట్‌వేను కూడా ఆయన ప్రారంభించారు. ప్రతి ఏడాది జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్‌ను సెలబ్రేట్ చేస్తున్న విషయం తెలిసిందే. కార్గిల్ యుద్ధ వీరుల స్మారకాన్ని విజిట్ చేయకుండానే ప్రజల తమ హీరోలకు ఈ-శ్రద్ధాంజలి ప్రకటించవచ్చు. ప్రజల్లో ఆ నాటి యుద్ధ పరిస్థితులపై చైతన్యం తీసుకువచ్చే ఉద్దేశంతో ఈ-శ్రద్ధాంజలి ప్రారంభించారు.