తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి భక్తులు తిరుమల కొండకు చేరుకుని భక్తిశ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో ఇవాళ తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి నిన్న రాత్రి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు.
ఈ తరుణంలో కేంద్రమంత్రి నితిన్ గడ్గరీ గాయత్రి నిలయంలో బస చేశారు. అనంతరం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన నితిన్ గడ్గరీ దంపతులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వారికి వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.