మనం ఏ కాలమైనా శరీరం కాస్త అలసటగా అనిపించిన, కొంత వేడిగా అనిపించినా వెంటనే కొబ్బరి నీళ్లు తాగమని ఇంట్లో పెద్దలు చెప్పడం మనం చూస్తుంటాం.. కానీ కొబ్బరి నీరే కాదు, కొబ్బరి తురుము ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.ఇందులో విటమిన్లు (B1,C) పొటాషియం, కాపర్, ఐరన్, ఫాస్ఫరస్, లారిక్ ఆమ్లం వంటివి సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరి తురుముని మితంగా తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు కొబ్బరి తురుము తీసుకోవడంలో జాగ్రత్తలు వహించాలి . మరి అవేంటి?
ఎలాంటి వ్యక్తులు కొబ్బరి తురుము తీసుకోకూడదనేది ఇప్పుడు తెలుసుకుందాం..
డయాబెటిస్ కు కొబ్బరి దివ్య ఔషధం : కొబ్బరి తురుములో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవడం వల్ల వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కొబ్బరి తురుములో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. లారీక్ ఆమ్లం వంటి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది టైప్2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగకరం కొబ్బరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించి డయాబెటిక్ సంబంధిత సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి.

ఎలాంటి వారు దూరం: కొబ్బరి తురుము ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ కొంతమంది వ్యక్తులు దీనిని తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు, వీటికి దూరంగా ఉండాలి. కొబ్బరి తురుములోని పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇది గుండె కండరాల పని తీరుకు మేలు చేస్తుంది. కానీ దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులు పొటాషియం స్థాయి అధికంగా ఉండడం ప్రమాదకరం అందుకే వీరు కొబ్బరి తురుముకి దూరంగా ఉండాలి.
కొబ్బరి ఉత్పత్తులపై ఎలర్జీ ఉన్నవారు మనకు అరుదుగా కనిపిస్తారు.కానీ కొందరిలో తీవ్రమైన రియాక్షన్స్ వస్తుంటాయి. కొబ్బరి తురుము తీసుకున్న తర్వాత చర్మం ఎరుపు, దురద, వాపు వంటి సమస్యలు కనిపిస్తాయి. అలాంటి ఎలర్జీలు కనిపించిన వెంటనే కొబ్బరి తీసుకోవడం మానివేయాలి.
హై బీపీ ఉన్నవారు కొబ్బరి తురుము తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి ఇందులోని అధిక పొటాషియం రక్తపోటు మందులు తీసుకునే వారికి ప్రమాదకరం కావచ్చు. ఈ మందులు శరీరంలో పొటాషియం స్థాయిని పెంచుతాయి. అధిక రక్తపోటు మందులు తీసుకునేవారు కొబ్బరి తురుమును తీసుకునే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
ఆయుర్వేద నిపుణులు కొబ్బరి తురుమును కూరలో లేదా ఏదైనా సలాడ్ లో తీసుకోవచ్చని సూచిస్తున్నారు. అయితే మితమైన పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని, నిపుణుల సలహా మేర మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. కొబ్బరి తురుము అధిక మోతాదులో తీసుకుంటే కొవ్వు కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మితంగా తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.
గమనిక:పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, ఎలాంటి అనారోగ్య లక్షణాలు వున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.