ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ సలహాదారుల పదవులు పెరుగుతున్నాయి. ఈ విషయంలో సోషల్ మీడియాలో విమర్శల ట్రెండింగ్ జోరుగా అవుతోంది. అయితే, వీరిలో చాలా మంది తెలంగాణకు చెందినవారే కావడం మరో విమర్శకు అవకాశం ఇచ్చింది. అయినా కూడా సీఎం జగన్ వీటిని ఏమాత్రమూ లెక్క చేయ కుండా.. తన దారిన తాను వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. సీఎంకు అన్ని శాఖలకు సంబంధించి సలహాదారులు ఇప్పుడు లెక్కకు మిక్కిలిగానే ఉన్నాయి.
ఇవి నియంత్రిత పోస్టులు కాకపోవడం, సీఎం విచక్షణపై ఆధారపడి ఉండడంతో వీటిని ఎవరూ ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. దీంతో సోషల్ మీడియా వేదికగా విమర్శల శరాలు బాగానే పడుతున్నాయి. మరీ ముఖ్యంగా సీఎం జగన్ సొంత మీడియా సాక్షిలో పనిచేసిన వారికి ఇప్పుడు ప్రభుత్వ సలహాదారులుగా నియమించడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇక తెలంగాణకు చెందిన వారికే ఈ పదవులు ఎక్కువుగా రావడమూ మరో చర్చకు దారితీసింది. ప్రధాన మీడియాలోను, చంద్రబాబు అనుకూల మీడియా లోనూ కూడా ఇవి కథనాల రూపంలో వస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఎక్కడా జగన్ వెనక్కి త గ్గడం లేదు.
తాజాగా కూడా మరో కీలక ఉద్యోగికి ప్రభుత్వ సలహాదారుగా ఛాన్స్ ఇవ్వడం గమనార్హం. ఆయనే ఆర్. ధ నుంజయరెడ్డి. సాక్షి ప్రింట్ మీడియా స్థాపించిన నాటి నుంచి ధనుంజయరెడ్డి పనిచేస్తున్నారు. సీఎం జగన్‌కు దూరపు బంధువు కూడా అని చెప్పుకొంటారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సాక్షి పత్రికా విభాగానికి రెసిడెంట్ ఎడిటర్ గా వ్యవహరించారు. దీనికి ముందు ఎడ్యుకేషన్ ఎడిటర్‌గా కూడా పనిచేశారు. ఇక, ఇప్పుడు ఆయనను జగన్ ప్రభుత్వ సలహాదారుగా తీసుకున్నారు.
కొన్నాళ్ల కిందట సాక్షికి రిజైన్ చేసిన ధనుంజయరెడ్డికి ఇప్పుడు గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ పర్యవేక్షణా సలహాదారుగా అవకాశం కల్పించారు. ఈయనకు నెలకు రూ.3.5 లక్షల వేతనంతోపాటు కేబినెట్ హోదా కల్పించారు. ఈ పరిణామంపై టీడీపీ నేతలు విమర్శలకు పదును పెంచడం గమనార్హం.