ఈ రోజుల్లో ఎక్కువమంది ఆఫీసులో గంటలు తరబడి కూర్చోవడం, తినగానే బద్ధకంగా అనిపించడం ఇవన్నీ మనకి మామూలు సమస్యల లాగ కనిపిస్తాయి. కానీ బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ తర్వాత చిన్నగా ఒక 15 నిమిషాలు నడక ఎంత అద్భుతమైందో మీకు తెలుసా? ఆ చిన్నపాటి అలవాటు మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇది కేవలం కడుపు నిండిన తర్వాత చేసే ఒక పని మాత్రమే కాదు, మీ ఆరోగ్యం శరీర శక్తి మానసిక ప్రశాంతత కోసం మీరు చేసే ఓ అద్భుతం. ఈ చిన్న నడకతో మీ ఆరోగ్యం ఎలా మెరుగు పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణ క్రియ మెరుగుపడుతుంది : భోజనం తర్వాత నడవడం జీర్ణవ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది. తిన్న ఆహారం పొట్ట నుంచి ప్రేగుల్లోకి వేగంగా వెళ్లడానికి సహాయపడుతుంది. దీంతో అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
రక్తంలో గ్లూకోజ్ స్థాయి: భోజనం తర్వాత అది పగలైనా, రాత్రి అయినా, కాసేపు నడవడం వల్ల కండరాలు గ్లూకోజ్ ను శక్తి కోసం వినియోగించుకుంటాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయి ఆకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటుంది. ఇది ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి లేదా మధుమేహం వస్తుందేమో అని సందేహం ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది.

బరువు తగ్గడం: భోజనం తర్వాత నడక వల్ల అదనపు కేలరీలు ఖర్చు అవుతాయి. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. క్రమం తప్పకుండా ఈ అలవాటు చేసుకుంటే బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది : నడక రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గించి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఒక మంచి మార్గం.
మంచి నిద్రకు ప్రేరేపిస్తుంది: సాయంత్రం భోజనం తర్వాత నడవడం వల్ల శరీరానికి తేలికపాటి వ్యాయామం లభించి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఒత్తిడి తగ్గిస్తుంది, రాత్రిపూట మంచి ఘాడమైన నిద్ర పట్టడానికి సహాయపడుతుంది.
ఇంతే కాక నడవడం వల్ల ఎండార్పిన్స్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. వీటిని ఫీల్ గుడ్ హార్మోన్స్ అని కూడా అంటారు. ఇవి ఒత్తిడిని ఆందోళన తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఈ చిన్న అలవాటు మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు. రోజుకు కనీసం 10 నుంచి 15 నిమిషాల నడకతో ఈ ప్రయోజనాలను పొందవచ్చు.
(గమనిక :ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది.)