ఒడిశాలో దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని ఓ హాస్టల్ లో విద్యార్థి చేసిన తుంటరి పనికి తోటి విద్యార్థుల ప్రాణాల మీదకు వచ్చింది. కందమాల్ జిల్లా సలగూడలోని సెబాశ్రమ్ స్కూల్ హాస్టల్ లో నిద్రిస్తున్న ఎనిమిది మంది విద్యార్థుల కళ్ళల్లో ఓ విద్యార్థి ఫెవిక్విక్ పోసాడు. దీంతో వారి కళ్ళు ఫెవిక్విక్ తో పూర్తిగా మూసుకుపోయాయి.

వారి కళ్ళు తెరుచుకోవడం లేదని విద్యార్థులు అరవడంతో విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. కొంతమంది విద్యార్థులకు కొద్దికొద్దిగా కళ్ళు తెరుచుకోగా మరి కొంతమందికి పూర్తిగా అలానే మూసుకుపోయాయి. ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. ఉపాధ్యాయులే ఈ విధంగా చేయించారా లేకపోతే ఈ ఘటనపై మరెవరైనా కావాలని కుట్ర చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై త్వరలోనే క్లారిటీ రానుంది. సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ వద్ద చేరుకొని టీచర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.