సృష్టికి మూలం అయిన శ్రీ మహావిష్ణువు సకల సంపదల ప్రదాత అయిన లక్ష్మీదేవి బంధం కేవలం భార్యాభర్తల సంబంధం మాత్రమే కాదు అది ధర్మం, ప్రేమ ఐశ్వర్యం కలయిక. పురాణాల ప్రకారం ఈ దివ్య దంపతుల బంధం అపారమైన ప్రేమకు, విశ్వం యొక్క సమతుల్యతకు ప్రతీక. శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటే అక్కడ సకల శుభాలు ఉంటాయని, ఆయన అనుగ్రహం ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుందని భక్తులు నమ్ముతారు. కానీ, లక్ష్మీదేవి విష్ణుమూర్తి వక్షస్థలంపై స్థానం పొందడం వెనుక ఒక గొప్ప పురాణ కథ ఉంది. అది వారి బంధాన్ని మరింత లోతుగా వివరిస్తుంది. ఆ కథను మనము తెలుసుకుందాం ..
పూర్వం ఒకసారి, భృగు మహర్షి త్రిమూర్తులలో (బ్రహ్మ, విష్ణు, శివ) ఎవరు గొప్పవారో పరీక్షించడానికి వెళ్ళారు. విష్ణుమూర్తి వైకుంఠంలో నిద్రపోతున్నప్పుడు ఆయన వక్షస్థలంపై కాలితో తన్నారు. అప్పుడు కూడా విష్ణువు కోపం చూపకుండా “మహర్షి మీ పాదం ఎంత మృదువైనది నా వక్షస్థలం గట్టిగా ఉంది మీకు నొప్పి కలిగించిందేమో” అని క్షమాపణ అడిగారు. అయితే విష్ణువు తన భర్త అయినప్పటికీ భక్తుడి చర్యను అంగీకరించడం లక్ష్మీదేవికి అవమానకరంగా తోచింది. తాను నివసించే స్థలంపై ఒక మహర్షి తన్నడం దానికి విష్ణువు నిశ్శబ్దంగా ఉండటం ఆమెకు నచ్చలేదు. అందుకే ఆమె వైకుంఠాన్ని విడిచి భూలోకం వెళ్లారు.

లక్ష్మీదేవిని వెతుకుతూ విష్ణుమూర్తి భూలోకానికి వచ్చారు. అక్కడ ఆయన వెంకటేశ్వరుడుగా అవతరించారు. లక్ష్మి లేని లోకంలో సంపదలు శోభ నశించాయి. శ్రీదేవి తన భర్త కోసం తపస్సు చేస్తుంటే, విష్ణువు వెంకటేశ్వరుడుగా ఆమెను వెతికారు. చివరకు, వీరిద్దరూ తిరిగి కలుసుకున్నారు. అప్పుడు లక్ష్మీదేవి తన భర్తతో “నాకు జరిగిన అవమానాన్ని మీరు కాపాడలేకపోయారు కాబట్టి నేను ఇకపై మీ వక్షస్థలంపై నివసించను” అని అంటారు. దానికి విష్ణువు “దేవీ నువ్వు నా హృదయంలో నా వక్షస్థలంలో ఎప్పటికీ ఉందువు. నీవు నా ప్రేమ, శక్తి ఐశ్వర్యం నేను నిన్ను ఒక కవచంలా నా హృదయంలో దాచుకుంటాను” అని మాట ఇచ్చారు. అప్పటి నుండి లక్ష్మీదేవి విష్ణుమూర్తి వక్షస్థలంపై శాశ్వతంగా నివసించారు. ఆ స్థానాన్ని ఆమె కోసం మాత్రమే కేటాయించారు. అందుకే భక్తులు శ్రీనివాసుడు (శ్రీ – లక్ష్మి నివాస – నివాసం) అని పిలుస్తారు.
ఈ పురాణ కథ నేటి భార్యాభర్తల సంబంధాలకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతుంది. ఒక బంధంలో ఒకరికొకరు ఇచ్చే గౌరవం ఎంత ముఖ్యమో ఈ కథ చెబుతుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం భారతీయ పురాణాల నుండి సేకరించబడింది. భక్తి, విశ్వాసాల ప్రకారం ఈ కథలు వేరు వేరుగా వుంటాయి.