పిల్లల పెంపకంలో క్రమశిక్షణ అనేది ఒక ముఖ్యమైన భాగం. అయితే చాలామంది తల్లిదండ్రులు కఠినమైన శిక్షలు, బెదిరింపులు, లేదా ఆంక్షలు పెట్టడం ద్వారా క్రమశిక్షణ నేర్పవచ్చని భావిస్తారు. కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పద్ధతులు పిల్లల్లో భయం ఆందోళన కలిగించడమే కాకుండా, వారి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి. పిల్లలు తప్పులు చేయడం సహజం. వాటిని సరిదిద్దడానికి, సరైన మార్గంలో నడిపించడానికి కఠినత్వం కాకుండా ప్రేమ, సహనం, అవగాహనతో కూడిన పద్ధతులు చాలా అవసరం. ఇది పిల్లలకు క్రమశిక్షణ నేర్పించడమే కాకుండా వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుంది.
ప్రేమతో క్రమశిక్షణ నేర్పడం ఎలా: పిల్లలు తప్పు చేసినప్పుడు వెంటనే కోపం తెచ్చుకోకుండా, వారు ఎందుకు అలా ప్రవర్తించారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారిని నిందించకుండా, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో వారికి శాంతంగా వివరించండి.
మంచి ప్రవర్తనకు ప్రోత్సాహం: పిల్లలు మంచి పనులు చేసినప్పుడు, వారిని మెచ్చుకోండి. చిన్న చిన్న విజయాలను కూడా గుర్తించి, వారిని ప్రోత్సహించండి. ఇది వారిలో మంచి ప్రవర్తనను పునరావృతం చేయడానికి ప్రేరణ కలిగిస్తుంది.

సరిహద్దులు స్పష్టంగా పెట్టండి: పిల్లలకు ఏం చేయాలో, ఏం చేయకూడదో స్పష్టంగా చెప్పండి. అయితే, ఈ సరిహద్దులు ఎందుకు అవసరమో వారికి అర్థమయ్యేలా వివరించండి. ఉదాహరణకు “ఆడటం అయిపోగానే బొమ్మలు సర్దాలి, లేకపోతే అవి పోతాయి” అని చెప్పడం.
ఆదర్శంగా ఉండండి: పిల్లలు తమ తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవడం, ఇతరులను గౌరవించడం వంటివి వారికి నేర్పిస్తే, వారు కూడా అవే అలవాటు చేసుకుంటారు. మీరు మీ మాటలను, చర్యలను సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.
ప్రతిఫలాలు, శిక్షలు: శిక్షలకు బదులుగా, మంచి ప్రవర్తనకు చిన్న చిన్న బహుమతులు ఇవ్వండి. ఉదాహరణకు, ఒక వారం రోజులు బాగా చదువుకుంటే, వారికి నచ్చిన ఆట వస్తువు కొనివ్వడం. చెడు ప్రవర్తనకు కొంత సమయం పాటు వారు ఇష్టపడే ఒక ఆటను ఆడకుండా చేయడం వంటివి పాటించవచ్చు. ఇది శిక్షలా కాకుండా పరిణామాన్ని నేర్పిస్తుంది.
ప్రేమ, సహనంతో కూడిన క్రమశిక్షణ పిల్లలను నిజమైన, బాధ్యత గల వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి సహాయపడుతుంది.