అమెరికాలో పోలీసుల కాల్పులో పాలమూరు వాసి మృతి చెందాడు. పోలీసుల కాల్పుల్లో బుల్లెట్ తగిలి మహబూబ్నగర్ వాసి అమెరుద్దీన్(29) మృతి చెందాడు. అమెరుద్దీన్కు అతని స్నేహితుడికి మధ్య గొడవ జరగగా, పోలీసులకు సమాచారమిచ్చాడు అతని స్నేహితుడు. పోలీసులు వచ్చినా ఇద్దరి మధ్య గొడవ ఆగకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు.

అయితే.. అమెరికాలో పోలీసుల కాల్పులో మృతిచెందిన పాలమూరు వాసి కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. 15 రోజుల క్రితం సెప్టెంబర్ 5న స్నేహితుడిని కత్తితో నాలుగు సార్లు పొడిచి దాడి చేశాడు అమెరుద్దీన్. మరో స్నేహితుడి సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు.
ఇక పోలీసులు వచ్చేసారికి అమెరుద్దీన్ తన స్నేహితుడి మీద కూర్చొని కత్తితో దాడి చేయడాన్ని చూసి హెచ్చరించినా వినకపోవడంతో.. అమెరుద్దీన్ మీద నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు పోలీసులు.
అనంతరం నిందితుడు అమెరుద్దీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా.. చేతులు, ఛాతీ, ఊపిరితిత్తులు మరియు పొత్తికడుపుపై కత్తిపోట్లకు చికిత్స పొందుతూ ప్రాణాలతో బయటపడ్డాడు బాధితుడు. అయితే ఇది మొదటి సారి కాదని గతంలో కూడా వీరి ఇద్దరి మధ్య ఏసీ విషయంలో గొడవ జరిగిందని తెలిపారు పోలీసులు.