ఒకప్పుడు బంధాలు విడిపోతే కాలంతో పాటు గాయాలు మానుకునేవి. కానీ, ఈ సోషల్ మీడియా యుగంలో ఒక బంధం ముగియడం అనేది అంత తేలిక కాదు. ఒక బంధం విడిపోయాక కూడా, ఆ వ్యక్తి జ్ఞాపకాలు ఫోటోలు, పోస్టులు మన ముందు కనిపిస్తూనే ఉంటాయి. ఇది ఆ గాయాన్ని మరింత లోతుగా,దీర్ఘకాలంగా మారుస్తుంది. ఈ కాలంలో బంధాలు విడిపోవడం ఎందుకు మరింత బాధాకరంగా మారిందో తెలుసుకుందాం..
జ్ఞాపకాలు వెంటాడే గోడలు: ఒక బంధం విడిపోయాక, మామూలుగా అయితే మనం ఆ జ్ఞాపకాలను, ఆ వ్యక్తిని దూరం చేసుకుని, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తాం. కానీ సోషల్ మీడియాలో అది సాధ్యం కాదు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో మీరు గతంలో షేర్ చేసుకున్న ఫోటోలు వీడియోలు, పోస్టులు ఎప్పటికీ తొలగిపోవు. అవి మీ ఫోటో గ్యాలరీలో, ప్రొఫైల్‌లో, లేదా ఇతరుల ప్రొఫైల్‌లలో కనిపిస్తూనే ఉంటాయి. ఈ జ్ఞాపకాలు తరచుగా కళ్ళ ముందు కనపడటం వల్ల ఆ గాయం మళ్ళీ మళ్ళీ తాజా అవుతుంది.

పోలికల పీడనం: విడిపోయిన తరువాత, చాలా మంది తమ మాజీ భాగస్వామి ప్రొఫైల్‌లను తరచుగా చూస్తుంటారు. వారు కొత్తగా ఏం చేస్తున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు అని గమనిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కనిపించే జీవితం తరచుగా వాస్తవం కాదు. కానీ మనం చూసే ఆ సంతోషకరమైన ఫోటోలు ఆనందకరమైన పోస్టులు మనలో అసూయ, అభద్రతాభావం, ఒంటరితనం పెంచుతాయి. మన మాజీ భాగస్వామి మనకంటే మంచి జీవితాన్ని గడుపుతున్నారని భావించి బాధపడతాం. ఈ నిరంతర పోలికల వల్ల మన మనస్సు మరింత గందరగోళానికి గురవుతుంది.
అంతం లేని సంభాషణలు: సోషల్ మీడియాలో విడిపోయిన తరువాత కూడా, నేరుగా లేదా పరోక్షంగా వారిని ఫాలో అవ్వడం, వారి పోస్టులకు రియాక్ట్ అవ్వడం, లేదా వారి పోస్టులపై ఇతరుల కామెంట్స్‌ను గమనించడం వంటివి చేస్తుంటాం. ఇది విడిపోయాక కూడా బంధాన్ని కొనసాగించేందుకు దారితీస్తుంది. ఇది మానసికంగా చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ఒక బంధానికి పూర్తి ముగింపు లభించకుండా, అది ఒక అంతులేని కథలాగా మిగిలిపోతుంది. ఆ వ్యక్తి మీ సోషల్ మీడియా ఫీడ్‌లో ఒక భాగమైపోవడం వల్ల, వారిని పూర్తిగా మర్చిపోవడం అసాధ్యం అవుతుంది.
సోషల్ మీడియా మన జీవితాలను సులభతరం చేసినప్పటికీ, మానసిక బంధాలను కఠినతరం చేసింది. బంధం ముగిసిన తరువాత, దాని నుండి పూర్తిగా బయటపడాలంటే సోషల్ మీడియా నుండి కొంత కాలం దూరంగా ఉండటం మంచిది. ఒక బంధం విడిపోయాక, ఆ వ్యక్తి ప్రొఫైల్‌లను గమనించడం మానేసి, కొత్త స్నేహాలు, హాబీలు, ఆసక్తులను అలవాటు చేసుకోవడం ద్వారా మన మనసును, జీవితాన్ని ఆరోగ్యవంతంగా మార్చుకోవచ్చు.