ఆధునిక జీవనశైలిలో అందం, ఆరోగ్యానికి సంబంధించిన అనేక ట్రెండ్‌లు వస్తుంటాయి. అలాంటి వాటిలో ఒకటి సన్‌బెడ్ వినియోగం. కానీ యూకే (యునైటెడ్ కింగ్‌డమ్) లోని వైద్య నిపుణులు మరియు క్యాన్సర్ పరిశోధనా సంస్థలు దీనిపై తీవ్ర హెచ్చరికలు జారీ చేయడమే కాక దీనిని పూర్తిగా నిషేధించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. తాత్కాలికంగా మెరిసే చర్మం కోసం వాడే ఈ సన్‌బెడ్‌లు, దీర్ఘకాలంలో ప్రాణాంతక మెలనోమా (చర్మ క్యాన్సర్) ప్రమాదాన్ని అసాధారణంగా పెంచుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువతలో సోషల్ మీడియా ప్రభావంతో ఈ సన్‌బెడ్‌ల వాడకం విపరీతంగా పెరగడం చాలా ఆందోళన కలిగించే విషయం.
సన్‌బెడ్‌లు వాడకం వల్ల కలిగే ప్రమాదాలు నిరూపితమైనవి. సన్‌బెడ్‌లు అత్యధిక మోతాదులో అతినీలలోహిత (UV) వికిరణాన్ని విడుదల చేస్తాయి, ఇది నేరుగా చర్మ కణాల DNAను దెబ్బతీస్తుంది. అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ (IARC) 2009లోనే సన్‌బెడ్‌ల నుండి వచ్చే UV కిరణాలను గ్రూప్ 1 కార్సినోజెన్ (క్యాన్సర్‌ను కలిగించే పదార్థం) గా వర్గీకరించింది. ఇది పొగాకు, ఆస్బెస్టాస్ వంటి వాటితో సమానమైన ప్రమాదకరమైన వర్గం. నిపుణుల గణాంకాల ప్రకారం, 35 ఏళ్ల కంటే ముందే సన్‌బెడ్‌ను ఒక్కసారి ఉపయోగించినా కూడా మెలనోమా వచ్చే ప్రమాదం 59% వరకు పెరుగుతుంది. యూకేలో ప్రతి సంవత్సరం సుమారు 100 మెలనోమా మరణాలు సన్‌బెడ్ వినియోగంతో ముడిపడి ఉన్నాయని అంచనా.

ప్రస్తుతం ఇంగ్లాండ్ వేల్స్‌లలో 18 ఏళ్ల లోపు వారు సన్‌బెడ్‌లను వాడటంపై నిషేధం ఉన్నప్పటికీ, ఈ నియంత్రణలు సమర్థవంతంగా పనిచేయడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, 16-17 ఏళ్ల యువతలో కూడా ఇప్పటికీ 34% మంది దీనిని వాడుతున్నారని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. అంతేకాక, సన్‌బెడ్ కేంద్రాల సంఖ్య, వాటి స్థానంపై ఎటువంటి పర్యవేక్షణ లేదు. ఈ కేంద్రాలు ముఖ్యంగా ఉత్తర ఇంగ్లాండ్‌లోని ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో అధికంగా ఉండటం ఆ ప్రాంతాల్లోని యువతలో మెలనోమా రేట్లు ఎక్కువగా ఉండటానికి కారణమవుతోందని నివేదికలు సూచిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో యూకే ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు, చర్మ క్యాన్సర్ రేటును తగ్గించేందుకు వాణిజ్య సన్‌బెడ్‌ల వినియోగాన్ని ఆస్ట్రేలియా మాదిరిగా తక్షణమే పూర్తిగా నిషేధించాలని అక్కడ నిపుణులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. నిషేధం ఒక్కటే ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుందని వారు వాదిస్తున్నారు.
గమనిక: సన్‌బెడ్‌ల వాడకం వల్ల కలిగే చర్మ క్యాన్సర్ ప్రమాదం వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది, చర్మ ఆరోగ్యంపై ఏవైనా సందేహాలుంటే చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం ఉత్తమం.