ఆధునిక జీవనంలో పరుగులు పెడుతున్న మనకు, మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేస్తూ వచ్చే పండుగ అట్లతద్ది. మహిళల జీవితంలో సౌభాగ్యం, సంతోషం, దాంపత్య బంధం చిరకాలం వర్ధిల్లాలని కోరుతూ జరుపుకునే ఈ వ్రతం అటు ఆధ్యాత్మికతకు, ఇటు ఆటపాటలకు అద్దం పడుతుంది. అక్టోబర్ 9 న రాబోతున్న ఈ పర్వదినం విశేషాలు, దాని వెనుక ఉన్న పురాణ కథను తెలుసుకుందాం.
అట్లతద్ది: భక్తి, విశ్వాసాలకు ప్రతీక: అట్లతద్ది (ఆశ్వయుజ బహుళ తదియ) తెలుగు రాష్ట్రాల మహిళలు అత్యంత నిష్టగా జరుపుకునే పండుగ. దీనినే ‘ఉయ్యాల పండుగ’ అని, ‘గోరింటాకు పండుగ’ అని కూడా అంటారు. పెళ్లైన స్త్రీలు తమ భర్తల ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కన్యలు మంచి భర్త లభించాలని కోరుతూ ఈ నోమును నోచుకుంటారు. ఉత్తర భారతదేశంలో దీనిని ‘కర్వా చౌత్’ అని అంటారు.
చంద్రోదయ ఉమా వ్రతం:అట్లతద్ది వ్రతానికి ‘చంద్రోదయ ఉమా వ్రతం’ అని మరో పేరు ఉంది. పురాణాల ప్రకారం, గౌరీ దేవి శివుడిని భర్తగా పొందాలని ఈ వ్రతాన్ని తొలిసారిగా ఆచరించిందని చెబుతారు.

పురాణ కథ: ఒకానొకప్పుడు ఒక రాజు కుమార్తె తన స్నేహితురాళ్లతో కలిసి అట్లతద్ది నోమును ఆచరిస్తుంది. వ్రత నియమం ప్రకారం, చంద్రోదయాన్ని చూసిన తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి. అయితే ఆకలికి తట్టుకోలేక సొమ్మసిల్లిన తన చెల్లెలిపై ప్రేమతో, ఆమె అన్న ఒక అద్దంలో తెల్లని వస్తువును చూపించి అది చంద్రుడు ఉదయించాడని నమ్మబలుకుతాడు. ఆమె ఆ మాట విని ఆహారం తీసుకుని వ్రతభంగం చేస్తుంది. దాని ఫలితంగా, ఆమె కోసం ఎన్నో సంబంధాలు వెతుకుతారు.
ఎన్ని సంబంధాలు చూసినా వృద్ధ పెళ్లి కొడుకులే దొరకడంతో ఆమె ఎంతో మనోవేదనతో ఒక అడవిలోకి వెళ్లి తపస్సు చేసింది. అటుగా వెళుతున్న పార్వతీ పరమేశ్వరులు ఆ అమ్మాయిని చూసి ఎందుకు అంత కలత చెందుతున్నావు ఈ అడవిలో ఇక్కడ కూర్చొని ఎందుకు తపస్సు చేస్తున్నావని అడగ్గా ఆమె జరిగిందంతా వారితో విన్నవించింది.
వెంటనే పార్వతీదేవి ఆ అమ్మాయితో నువ్వు చంద్రోదయ ఉమావ్రతంలో ఉపవాసా నియమాన్ని ఉల్లంఘించినందునే నీకు ఎటువంటి సంబంధాలు దొరకడం లేదు ఇప్పుడు మళ్లీ వెళ్లి ఆ వ్రతం ఆచరించు నీకు మంచి భర్త లభిస్తాడని చెప్పడంతో ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి వాళ్ళ అన్నలతో జరిగిందంతా చెప్పి మరల వ్రతాన్ని ఆచరిస్తుంది. అప్పుడే అమ్మాయికి మంచి వరుడు లభించడం జరుగుతుంది. అప్పటి నుంచి ఈ నోము స్త్రీల సౌభాగ్యానికి ప్రతీకగా నిలిచింది.

అక్టోబర్ 9 (2025) ఆధ్యాత్మిక విశేషాలు: ఈ ఏడాది (2025) అట్లతద్ది పండుగ అక్టోబర్ 9, గురువారం నాడు వచ్చింది. ఈ రోజున ఉపవాసం ఉండి, సాయంత్రం గౌరీదేవిని షోడశోపచారాలతో పూజిస్తారు. చంద్రోదయం తర్వాత చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి, ఉపవాసాన్ని విరమిస్తారు. నవగ్రహాలలో కుజుడికి (అంగారకుడు) అట్లంటే మహా ప్రీతి. ఈ పండుగ రోజున వాయనంగా ఇచ్చే అట్లు కుజదోషాన్ని తొలగిస్తాయని, వైవాహిక జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
పూజా విధానం: ఉదయం ఉపవాసం వుండి,సాయంత్రం పూజ పూర్తీ అయ్యాక, గౌరీ దేవికి 9 లేదా 11 అట్లను నైవేద్యంగా సమర్పించడం, తోటి ముత్తయిదువులకు అట్లు, తాంబూలం, పండ్లు వాయనంగా ఇవ్వడం ఈ వ్రతంలో ప్రధానాంశాలు.
ముఖ్య నియమాలు: హిందూ సంప్రదాయం ప్రకారం చిన్న పెద్ద తేడా లేకుండా ఆడపిల్లలు అందరు ఈ రోజున తెల్లవారుజామునే ఆహారం (సర్గి) తీసుకుని రోజంతా ఉపవాసం ఉండడం, గోరింటాకు పెట్టుకోవడం ఉయ్యాల ఊగడం ఈ పండుగలోని ముఖ్య సంప్రదాయాలు గా పాటిస్తున్నారు. విద్య, వున్నతి,శ్రేయస్సు కోసం ఈ వ్రతం ఆచరిస్తారని పండితులు తెలుపుతున్నారు.
అట్లతద్ది కేవలం వ్రతం మాత్రమే కాదు కుటుంబ బంధాలను, స్నేహాలను పెంచే ఒక అపురూపమైన వేడుక. ఈ పండుగ సందర్భంగా స్త్రీలు తమ దాంపత్య జీవితంలో శాశ్వతమైన ప్రేమ, సుఖ సంతోషాలను పొందాలని భగవంతుడిని కోరుకుంటారు.