రోజువారీ పరిశుభ్రతలో సబ్బు (Soap) అత్యంత కీలకం. మీ ఇంట్లో అందరూ ఒకే సబ్బు వాడుతున్నారా? మీ కుటుంబం ఒకే సోప్ వాడుతోందా? డాక్టర్లు చెబుతున్న హెచ్చరిక చుస్తే, ఇలా వాడటం కరెక్ట్ కాదు. మీ చర్మ ఆరోగ్యానికి ఇది అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఒకరి చర్మానికి సరిపోయే సబ్బు మరొకరికి హాని కలిగించవచ్చు. ఒకే సబ్బును వాడడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ప్రతి ఒక్కరూ వారి చర్మానికి తగినట్లుగా సబ్బును ఎందుకు ఎంచుకోవాలో తెలుసుకుందాం.
ఒకే సబ్బు వాడితే వచ్చే సమస్యలు: చాలా కుటుంబాల్లో ఒకే సబ్బు లేదా బాడీ వాష్‌ను అందరూ ఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల చిన్న సమస్యలే కాక, కొన్నిసార్లు పెద్ద చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
చర్మ రకాల మధ్య తేడాలు: ప్రతి ఒక్కరి చర్మం రకం వేరుగా ఉంటుంది. ఉదాహరణకు, పిల్లల చర్మం చాలా సున్నితంగా (Sensitive) ఉంటుంది. వారికి పెద్దలు వాడే బలమైన రసాయనాలు లేదా అధిక pH స్థాయి ఉన్న సబ్బులు చికాకును, పొడిబారడాన్ని (Dryness) కలిగిస్తాయి. మొటిమలు (Acne) ఉన్న యువకులు, చమురు చర్మం (Oily Skin) ఉన్న పెద్దలు ఉపయోగించే యాంటీ-బాక్టీరియల్ సబ్బులు సున్నితమైన చర్మంపై హార్ష్‌గా పనిచేస్తాయి.

చర్మ pH స్థాయికి భంగం: సాధారణ సబ్బుల pH స్థాయి 9 నుండి 10 వరకు ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మం pH (4.5 నుండి 5.5) కంటే చాలా ఎక్కువ. అధిక pH ఉన్న సబ్బులను తరచుగా ఉపయోగించడం వల్ల చర్మంపై ఉండే సహజ నూనెలు రక్షిత పొర (Acid Mantle) దెబ్బతింటుంది. ఇది చర్మాన్ని పొడిగా మార్చి, దురద, అలర్జీలకు గురిచేస్తుంది.
బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి: ఒకే సబ్బును ఎక్కువ మంది ఉపయోగించడం వల్ల, ముఖ్యంగా సబ్బు బిళ్ళను తడి ప్రదేశంలో ఉంచినప్పుడు, దానిపై బ్యాక్టీరియా ఫంగస్ చేరే ప్రమాదం ఉంది. సబ్బుపై చేరిన సూక్ష్మక్రిములు ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించి చర్మ ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు.
చర్మం రకాన్ని బట్టి సబ్బును ఎలా ఎంచుకోవాలి: ప్రతి ఒక్కరూ తమ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వారి అవసరాలకు అనుగుణంగా సబ్బును ఎంచుకోవాలి.ఇక పొడి,సున్నితమైన చర్మానికి సున్నితమైన చర్మానికి సువాసనలు లేని, మోయిశ్చరైజింగ్ లక్షణాలున్న సబ్బులు లేదా pH తక్కువగా ఉండే “సిండీట్స్” వంటి మైల్డ్ క్లెన్సర్‌లు ఉత్తమం. చమురు చర్మానికి,మొటిమలకు, సాలిసిలిక్ యాసిడ్ లేదా టీ ట్రీ ఆయిల్ వంటి పదార్థాలు ఉన్న యాంటీ-బ్యాక్టీరియల్ సబ్బులను ఎంచుకోవాలి. సాధారణ చర్మానికి ఐతే తక్కువ రసాయనాలు, సహజ పదార్థాలు ఉన్న సబ్బులు సరిపోతాయి.
సబ్బును ఎంచుకునే విషయంలో డబ్బు ఆదా చేయడం కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులు వేర్వేరు సబ్బులు లేదా బాడీ వాష్‌లను ఉపయోగించడం ద్వారా అనవసరమైన చర్మ సమస్యలను నివారించవచ్చు.
గమనిక: మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు తరచుగా చర్మ సమస్యలు వస్తుంటే, వెంటనే చర్మ వైద్య నిపుణుడిని (Dermatologist) సంప్రదించి, మీ చర్మ రకానికి తగిన సరైన సబ్బును ఎంచుకోండి.