కుటుంబంతో ఎక్కువ స‌మ‌యం గ‌డిపే చాన్స్ ఇచ్చిన.. ఓ లాక్‌డౌన్‌.. నీకు వంద‌నం..!

-

ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో మ‌నిషి.. తాను మ‌నిషిన‌నే విష‌యాన్ని నిజంగా ఎప్పుడో మ‌రిచిపోయాడు. నిత్యం లేవ‌డం.. హ‌డావిడిగా ఆఫీసుల‌కు, పాఠ‌శాల‌లకు, కాలేజీల‌కు వెళ్ల‌డం.. తీవ్ర‌మైన ఒత్తిడిలో పనిచేయ‌డం.. ర‌ద్దీగా ఉండే ట్రాఫిక్‌లో ఇంటికి రావ‌డం.. మాన‌సిక ప్ర‌శాంత‌త లోపించ‌డం.. వెర‌సి.. స‌గ‌టు పౌరుడు అస‌లు ఆరోగ్యవంత‌మైన జీవ‌న విధానాన్ని పాటించ‌డం లేదు స‌రి క‌దా.. ఎప్పుడూ మాన‌సిక స‌మ‌స్య‌లు, ఒత్తిళ్ల‌తోనే స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఇక మ‌హిళ‌ల విష‌యానికి వ‌స్తే.. ఉద్యోగాలు చేసే వారైనా.. గృహిణులైనా.. వారికి ఎప్పుడూ స‌మ‌స్య‌లే.. ఒక భార్య‌గా, త‌ల్లిగా, కోడ‌లిగా వారు నిత్యం అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కొంటుంటారు.

how corona lock down gave us more time to spend with our family members

ఉద్యోగాలు చేసే మ‌హిళ అయినా.. గృహిణిగా ఉండే మ‌హిళ అయినా స‌రే.. కుటుంబంలో మ‌హిళ పాత్ర చాలా కీల‌కం. మ‌హిళ త‌న కుటుంబానికి ఇచ్చిన స‌పోర్టు నిజంగా ఎవ‌రూ ఇవ్వ‌రు. ఆమె త‌న పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతుంది. శ్ర‌మిస్తుంది.. వారు విజ‌యం సాధిస్తే.. లోలోప‌ల సంతోష ప‌డుతుంది త‌ప్ప ఎలాంటి ఫ‌లితాన్ని ఆశించ‌దు. ఇక ఈ ప‌రిస్థితిలో ఉద్యోగాలు చేసే మ‌హిళ‌లు ఉంటే.. వారిపై మ‌రిన్ని బాధ్య‌త‌లు ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ అలాంటి మ‌హిళలు ఓ వైపు ప‌నిని.. మ‌రో వైపు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతుంటారు.

మ‌హిళ‌లు ఒక‌ప్ప‌టిలా కాదు.. ప్ర‌స్తుతం అన్ని రంగాల్లోనూ పోటీ ప‌డుతున్నారు. పురుషుల‌కు దీటుగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ స‌మాన‌త్వం విష‌యంలో పురుషుల‌దే ఇంకా ఆధిపత్యం కొన‌సాగుతోంది. ఇక మ‌న దేశంలో ఉద్యోగాలు చేసే మ‌హిళ‌లు నిత్యం చాలా క‌ఠిన‌మైన స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ఇంటి ప‌ని, వంట ప‌ని, కుటుంబ స‌భ్యుల సంర‌క్ష‌ణ‌తోపాటు.. ప‌ని ఒత్తిడి కొంద‌రు మహిళ‌ల‌కు ఎక్కువ‌గా ఉంటోంది. మ‌న దేశంలో వ‌ర్కింగ్ వుమెన్‌కు.. ఇత‌ర దేశాల్లో వారికి చాలా వ్య‌త్యాసం ఉంది. ఇక్క‌డ అలాంటి మ‌హిళ‌లు ఇంటి ప‌నితోపాటు జాబ్‌లోనూ ఒత్తిళ్ల‌ను ఎదుర్కొంటుంటారు. నిత్యం మ‌హిళ‌ల‌కు ఇల్లు, ఆఫీసు ర‌ణక్షేత్రంలా అనిపిస్తాయి. వారు ఎన్నో స‌మ‌స్య‌ల‌తో యుద్ధాలు చేస్తుంటారు. అయిన‌ప్ప‌టికీ వారిని ఆప‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదు. ఇక వారు ఎలాంటి ఫిర్యాదులూ చేయ‌రు. ఏమీ కావాల‌ని అడ‌గ‌రు. ఎలాంటి ప్ర‌శ్న‌లూ వేయ‌రు.. కుటుంబంలో, ఉద్యోగంలో తాము పోషించాల్సిన పాత్ర‌లకు 200 శాతం న్యాయం చేస్తారు.

ఇక ప్ర‌స్తుతం న‌డుస్తున్న ఆధునిక యుగంలో మాన‌వ సంబంధాలు కూడా రోజు రోజుకీ స‌న్న‌గిల్లుతున్నాయి. ఇరుగు పొరుగున ఉన్న‌వారు ఎలా ఉంటున్నారు..? అన్న సంగ‌తి ప‌క్క‌న పెడితే.. సొంత కుటుంబంలోనే ఎవ‌రు ఎలా ఉన్నారు..? ఏం చేస్తున్నారు..? వారికి ఏమైనా స‌మ‌స్య‌లు ఉన్నాయా..? అన్న విష‌యాల‌ను ఒక‌రికొక‌రు తెలుసుకోవ‌డం లేదు. దీంతో కుటుంబ సంబంధాలే స‌న్న‌గిల్లుతున్నాయి. అయితే మ‌నుషుల‌ను దేవుడు అప్పుడ‌ప్పుడు ప‌రీక్షిస్తుంటాడు.. అన్న మాట‌ను ఒక్క‌సారి గుర్తుకు తెచ్చుకుంటే.. మ‌నిషికి త‌న బంధాల‌ను గుర్తు చేసేందుకే.. దేవుడు.. ఇలా క‌రోనాను ప్ర‌యోగించాడా..? అన్న సందేహం క‌లుగుతుంది. ఎందుకంటే.. కాంక్రీట్ జంగిల్స్‌లా మారుతున్న న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో మ‌నుషులు త‌మ కుటుంబాల‌తో నిత్యం గ‌డిపే స‌మ‌యం చాలా త‌క్కువ‌గా ఉంటుంది. ఇది వారి మ‌ధ్య బంధాలు సన్న‌గిల్లేందుకు ముఖ్య కార‌ణంగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆ దేవుడు.. ఓ మ‌నిషీ.. ముందు నువ్వు నెర‌వేర్చాల్సిన బాధ్య‌త‌ల‌ను.. నీ బంధాల‌ను ఒక్క‌సారి గుర్తు తెచ్చుకో.. నీ కుటుంబ స‌భ్యులు, నీ చుట్టూ ఉన్న‌వారిని ఆత్మీయంగా ప‌ల‌క‌రించు.. వారి క‌ష్ట న‌ష్టాల‌ను తెలుసుకో. మ‌నిషివి.. మ‌ళ్లీ మ‌నిషిలా జీవించు.. అని చెప్పేందుకే.. ఇలా క‌రోనా లాక్‌డౌన్‌తో జ‌నాల‌ను ఇండ్ల‌కే ప‌రిమితం చేశాడ‌ని.. అనిపిస్తోంది.

క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల ఎప్ప‌టికైనా ఆ వైర‌స్ నాశ‌నం అవ్వాల్సిందే. ఈ వ్య‌వ‌ధిలో జ‌నాలు నిత్యం ఇండ్ల‌లోనే ఉండాలి.. ఉంటున్నారు కూడా.. దీంతో వారు త‌మ త‌మ కుటుంబ స‌భ్యుల‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డిపే అవ‌కాశం ద‌క్కింది. క‌నీసం ఈ స‌మ‌యాన్న‌యినా జ‌నాలు స‌ద్వినియోగం చేసుకోవాలి. నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో మ‌నం ఏం మ‌రిచిపోతున్నామో తెలుసుకోవాలి. మ‌న కుటుంబ స‌భ్యులు, ఇరుగు పొరుగు వారిని ఆత్మీయంగా ప‌ల‌క‌రించాలి. ఇంట్లో ఉన్న‌వారితో వీలైనంత ఎక్కువ సేపు మాట్లాడాలి. ఒక్కొక్క‌రూ ఒక్కొక్క‌రితో మాట్లాడి.. ఒక‌రి స‌మ‌స్య‌ల‌ను మ‌రొక‌రు అర్థం చేసుకోవాలి. పెద్ద‌లు పిల్ల‌ల‌కు వారి భ‌విష్య‌త్తుకు మార్గ‌నిర్దేశ‌నం చేయాలి. పిల్ల‌లు క‌ల‌సి వ‌చ్చిన స‌మయాన్ని వృథా చేయ‌కుండా త‌మ అంద‌మైన భ‌విష్య‌త్తుకు బాట‌లు వేసుకోవాలి. కుటుంబంలో మ‌హిళ‌లు ప‌డే క‌ష్టాల‌ను తోటి స‌భ్యులు తెలుసుకుని అండ‌గా నిల‌వాలి. వారికి ఇలాంటి స‌మ‌యంలోనైనా కాస్త విశ్రాంతి ఇవ్వాలి. వారి మ‌న‌స్సుకు ఊర‌ట క‌లిగించాలి. ఇక ఎవ‌రైనా త‌మ కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, బంధువుల ప‌ట్ల త‌ప్పు చేశామ‌ని భావిస్తే.. ఒక్క‌సారి వారితో మ‌న‌స్ఫూర్తిగా మాట్లాడాలి. అవ‌స‌రం అయితే క్ష‌మాప‌ణ‌లు కోరాలి. ఈ క‌ష్ట స‌మ‌యంలో ఇలాంటి మాటలు ఎదుటివారిలో ఎంతో ధైర్యాన్ని నింపుతాయి. మ‌నిషిని ఒక మ‌నిషి.. మ‌నిషిగా గుర్తిస్తాడు.

ఒక ర‌కంగా చెప్పాలంటే.. ఇప్పుడు మ‌నం పాటిస్తున్న లాక్‌డౌన్ నిజానికి కరోనా లాక్‌డౌన్ మాత్ర‌మే కాదు.. కుటుంబ స‌భ్యుల‌తో మ‌నం ఎక్కువ స‌మ‌యం గ‌డ‌పాల‌ని.. ఆ దేవుడు మ‌న‌కు ఇచ్చిన అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు.. ఇది నిజ‌మేన‌ని న‌మ్మేవారు.. త‌మ త‌ప్పుల‌ను తాము తెలుసుకుని త‌మ జీవితాన్ని అందంగా మ‌లుచుకుంటారు. నిత్యం తాము ఏం మిస్స‌వుతున్నామోన‌నే విష‌యం తెలుసుకుంటారు. ఇక‌పై కూడా కుటుంబ స‌భ్యుల‌కు ఎక్కువ స‌మ‌యం కేటాయించేందుకు య‌త్నిస్తారు. రోజు రోజుకీ న‌శిస్తున్న మాన‌వ సంబంధాలు, విలువలు.. మ‌ళ్లీ పున‌రుజ్జీవం చెందుతాయి.. నిజానికి మ‌న‌కు అంత‌క‌న్నా కావ‌ల్సిందేముంది.. మ‌నిషి తాను మ‌నిషిన‌ని తెలుసుకుంటే చాలు.. స‌మాజంలో మార్పు దానంత‌ట అదే వ‌స్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news