ఆంధ్రప్రదేశ్ లో కరోనా రోజు రోజుకి విస్తరిస్తుంది. దీన్ని కట్టడి చేయడానికి గానూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే అది సాధ్యం కావడం లేదు. ప్రభుత్వం ఎక్కడిక్కడ కఠిన చర్యలు తీసుకుంటుంది. వైరస్ వ్యాప్తిని నిరోధించడం లో ఇప్పటికే జగన్ కేంద్ర సహకారాన్ని కూడా కోరిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 161 కి చేరుకుంది. దీనితో జగన్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తాజాగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సర్వీసులు ఎస్మా పరిధిలోకి తెస్తూ జగన్ నిర్ణయం వెల్లడించారు. ఈ సర్వీసులను రాబోయే 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
ఎస్మా పరిధిలోకి వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బందిని చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణాను కూడా ఏపీ ప్రభుత్వం ఎస్మా పరిధిలోకి తీసుకురావడం గమనార్హం. మందుల కొనుగోలు, రవాణా, తయారీ, అంబులెన్స్ సర్వీసులు, మంచినీరు, విద్యుత్ సరఫరా, భద్రత, ఆహార సరఫరా, బయో మెడికల్ వేస్ట్‌ను ప్రభుత్వం ఎస్మా పరిధిలోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.