రేపు (నవంబర్ 26, 2025) అద్భుతమైన సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కార్తికేయ స్వామిని ఆరాధించడం అత్యంత పుణ్యఫలం కలిగిస్తుంది. శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుడు జ్ఞానం, ధైర్యం, సంతానం ప్రసాదించే దేవుడిగా వర్ణించబడాడు. జీవితంలో కష్టాలు తొలగిపోయి, కోరిన కోరికలు తీరాలంటే, ఈ పర్వదినాన స్వామివారిని ఎలా ఆరాధించాలో తెలుసుకుందాం.
సుబ్రహ్మణ్య షష్ఠి పూజా విధానం: సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఉదయాన్నే నిద్ర లేచి, తలంటు స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిలో స్వామివారి పటం లేదా విగ్రహం ముందు ముగ్గు వేసి, పూలతో అలంకరించాలి. ముఖ్యంగా మల్లి, మొగలి, సంపంగి, ఎరుపు రంగు పువ్వులు స్వామివారికి చాలా ఇష్టం. ఆ తరువాత దీపారాధన చేసి స్వామివారికి పానకం, వడపప్పు, పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. వీలైతే ఈ రోజున పాలు, పండ్లతో మాత్రమే ఉపవాసం పాటించడం శ్రేయస్కరం.

సుబ్రహ్మణ్య స్వామి పూజ: స్వామిని పూజించేటప్పుడు “ఓం శరవణభవాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. నాగదోషం, సంతానలేమి, ఆర్థిక సమస్యలు వంటి ఇబ్బందులతో బాధపడేవారు ఈ రోజున నాగదేవత విగ్రహాలను దర్శించుకుని, పాలు పోసి పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది. ముఖ్యంగా కుజదోష నివారణకు ఈ షష్ఠి పూజ దివ్యౌషధంలా పనిచేస్తుంది. భక్తితో, మనఃస్ఫూర్తిగా చేసిన ఈ ఆరాధన తప్పకుండా మీకు వరప్రసాదాన్ని అందిస్తుంది.
ఈ సుబ్రహ్మణ్య షష్ఠి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు మన జీవితంలో సమస్యలను పారద్రోలి, శుభాలను ఆహ్వానించే గొప్ప అవకాశం. స్వామివారిని పూజించడం ద్వారా జ్ఞానం, ధైర్యం, ఆరోగ్యం, విజయం వంటి షట్గుణాల ప్రసాదం లభిస్తుంది. షష్ఠి రోజున ఉపవాసం దీక్ష, పూజతో పాటు పేదవారికి లేదా పిల్లలకు అన్నదానం చేయడం, సుబ్రహ్మణ్య ఆలయాలను సందర్శించడం మరింత మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ అద్భుతమైన రోజున స్వామివారి అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఉండాలని మనసారా కోరుకుందాం. “సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు!”
గమనిక: ఈ పూజా విధానాలు మరియు నమ్మకాలు పూర్తిగా ఆధ్యాత్మిక గ్రంథాలు, పండితుల సూచనల ఆధారంగా ఇవ్వబడినవి. మీ వ్యక్తిగత పూజా పద్ధతులు, కుటుంబ ఆచారాలను అనుసరించడం ఎల్లప్పుడూ ఉత్తమం.
