మనం ప్రతిరోజూ నిద్రపోతాం కానీ ఆ నిద్ర మన శరీరానికి నిజంగా డీప్ హీలింగ్ చేస్తుందా? ఆయుర్వేదం ప్రకారం నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, మన శరీరం మరియు మనస్సు మరమ్మత్తు చేసుకునే సమయం. మనం నిద్రపోయే పద్ధతి, సమయం మరియు అలవాట్లు మన ఆరోగ్యంపై జీవక్రియపై ప్రభావం చూపుతాయి. ఆయుర్వేద సూత్రాలను అనుసరించి రాత్రి పడుకుంటే, మీ శరీరంలో డీప్ హీలింగ్ ప్రక్రియ ఎలా మొదలవుతుందో తెలుసుకుందాం.
ఆయుర్వేదం ప్రకారం నిద్ర: ఆయుర్వేదం ప్రకారం నిద్ర సమయం చాలా ముఖ్యమైనది. రాత్రి 10 గంటల లోపు నిద్రించడం అత్యంత శ్రేయస్కరం. ఎందుకంటే, ఆయుర్వేదంలో రోజును మూడు దోషాల (వాత, పిత్త, కఫ) చక్రాలుగా విభజిస్తారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 2 గంటల వరకు పిత్త దోషం సమయం ఉంటుంది, ఇది జీవక్రియ మరియు దహన క్రియలకు (Burning Process) సంబంధించినది.
ఈ సమయంలో మనం మేల్కొని ఉంటే శరీరం తన డీటాక్సిఫికేషన్ (విష పదార్థాలను తొలగించడం) మరియు పునరుద్ధరణ ప్రక్రియలను సమర్థవంతంగా చేయలేదు. 10 గంటల లోపు పడుకోవడం వల్ల శరీరం పిత్త సమయాన్ని విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించుకుంటుంది తద్వారా లోతైన వైద్యం (డీప్ హీలింగ్) ప్రారంభమవుతుంది.

నిద్రపోయే దిశ: ఇది కూడా ముఖ్యమని ఆయుర్వేదం చెబుతుంది. ఉత్తరం వైపు తల పెట్టి పడుకోవడం మంచిది కాదని అంటారు. ఎందుకంటే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం (Magnetic Field) ఉత్తరం నుండి దక్షిణానికి ఉంటుంది. ఉత్తరం వైపు తల పెడితే మన శరీరంలోని ఇనుముపై ప్రభావం పడి, రక్త ప్రసరణపై ఒత్తిడి పెరిగి, నిద్రకు భంగం కలిగించవచ్చు. అందుకే దక్షిణం వైపు లేదా తూర్పు వైపు తల పెట్టి పడుకోవడం శ్రేయస్కరం.
దక్షిణ దిశలో పడుకోవడం వల్ల అయస్కాంత ధ్రువాలు సమన్వయం చెంది, రక్త ప్రసరణ మెరుగుపడి, గాఢ నిద్ర లభిస్తుంది. అలాగే రాత్రి పడుకునే ముందు పాదాలకు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి, మంచి నిద్ర పడుతుందని సూచిస్తారు.
గమనిక: నిద్ర విషయంలో ప్రతి వ్యక్తి దోష బట్టి చిన్నపాటి తేడాలు ఉండవచ్చు. ఉత్తమ ఫలితాల కోసం, ఆయుర్వేదంలో పేర్కొన్న ఈ నియమాలను పాటించేటప్పుడు, ఒక అనుభవజ్ఞుడైన ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించండి.
