కిడ్నీ స్టోన్స్ (మూత్రపిండాలలో రాళ్లు) అనే మాట వింటేనే చాలామంది వెన్నులో వణుకు పుడుతుంది. దీని నొప్పిని భరించడం దాదాపు అసాధ్యం. అయితే ఈ భయంకరమైన సమస్య పెద్దగా మారడానికి చాలా ముందుగానే మన శరీరం మనకు కొన్ని స్పష్టమైన హెచ్చరికలు ఇస్తుంది. ముఖ్యంగా మనం ప్రతిరోజూ గమనించే యూరిన్ (మూత్రం) రంగు, వాసన మరియు దాని ప్రవాహంలో వచ్చే చిన్న చిన్న మార్పులు కిడ్నీల్లో ఏదో సమస్య మొదలవుతోందని సూచిస్తాయి. ఆ అత్యంత ముఖ్యమైన మార్పులేమిటో తెలుసుకుందాం.
కిడ్నీ స్టోన్స్ ఏర్పడటం లేదా కదలడం ప్రారంభించినప్పుడు, మూత్ర వ్యవస్థపై దాని ప్రభావం మొదలవుతుంది. ఈ సమయంలో మూత్రంలో కనిపించే ప్రధాన మార్పులు కిడ్నీ స్టోన్స్ ప్రమాదాన్ని సూచిస్తాయి.
మూత్రం రంగులో మార్పు : కిడ్నీ స్టోన్ మూత్ర నాళంలో (Urinary Tract) కదులుతున్నప్పుడు లేదా చిక్కుకున్నప్పుడు, అది లోపలి గోడలను గీరుకుంటూ వెళ్లడం వల్ల చిన్న రక్తస్రావం జరుగుతుంది. దీని కారణంగా మూత్రం రంగు సాధారణ పసుపు నుండి లేత పింక్, ఎరుపు లేదా గోధుమ రంగులోకి మారవచ్చు. ఇది స్పష్టమైన హెమటూరియా (రక్తం) సంకేతం.
మూత్రం మేఘావృతం కావడం: మూత్రం పాలులాగా తెల్లగా లేదా మేఘంలాగా మసకబారడం ఇన్ఫెక్షన్ లేదా మూత్రంలో అధిక ఖనిజాలు ఉన్నాయని సూచిస్తుంది. కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పుడు మూత్రం రంగు మారుతుంది.

తీవ్రమైన దుర్వాసన: ఆరోగ్యంగా ఉన్నప్పుడు మూత్రం సహజమైన వాసనతో ఉంటుంది. కానీ కిడ్నీ స్టోన్స్ లేదా దాని వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా మూత్రం తీవ్రమైన, ఘాటైన దుర్వాసనను కలిగి ఉంటుంది.
తరుచుగా మూత్ర విసర్జన : స్టోన్ కిందకు వచ్చి మూత్రాశయం దగ్గర చిక్కుకున్నప్పుడు, తరచుగా మూత్రానికి వెళ్లాలనే కోరిక కలుగుతుంది. కొంతమందికి మూత్రం వచ్చినా పూర్తిగా బయటకు రావడం లేదనే భావన ఉంటుంది.
ఈ రకమైన మూత్ర మార్పులు కనిపించిన వెంటనే భయపడాల్సిన అవసరం లేదు, కానీ వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ఈ మార్పులు తీవ్రమైన నడుము నొప్పి లేదా పొత్తికడుపు నొప్పితో కలిసి ఉంటే, అది కిడ్నీ స్టోన్‌కు నిదర్శనం కావచ్చు.
ఈ సమస్య రాకుండా ఉండాలంటే ప్రధానంగా రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీరు తప్పకుండా తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్రం పలచబడి, ఖనిజాలు రాళ్లుగా మారకుండా బయటకు వెళ్లిపోతాయి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి చిన్న చిన్న మార్పులను కూడా గమనిస్తూ, ముందుగానే జాగర్త పడటం మంచిది అంటున్నారు నిపుణులు.
గమనిక: మూత్రం రంగు లేదా వాసనలో నిరంతరాయంగా మార్పులు వస్తే, అది కేవలం కిడ్నీ స్టోన్స్ మాత్రమే కాకుండా ఇతర మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు లేదా మధుమేహం వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. కాబట్టి వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సరైన నిర్ధారణ మరియు చికిత్స తీసుకోవడం తప్పనిసరి.
