ప్రతి హిందూ కుటుంబంలోనూ ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం ఒక సాధారణ ఆచారం. అయితే ఒక్క రోజు దీపం పెట్టకపోతే ఏదో అశుభం జరుగుతుందేమోనని చాలామంది భయపడుతుంటారు. పాత తరం నుంచి వస్తున్న ఈ ఆచారం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? దీపం వెలిగించకపోతే నిజంగానే దురదృష్టమా? అశుభం అనేది కేవలం మన ఆలోచనల్లోనే ఉందా? ఈ ఆచారానికి ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య, మానసిక సంబంధమైన కారణాలు తెలుసుకుందాం..
దీపం వెలిగించడాన్ని కేవలం ఒక ఆచారంలా కాకుండా దాని వెనుక ఉన్న లోతైన అర్థాన్ని తెలుసుకోవాలి. హిందూ ధర్మంలో అగ్నిని (దీపాన్ని) సాక్షిగా, దేవుని స్వరూపంగా భావిస్తారు. దీపం మన చుట్టూ ఉన్న అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ఇస్తుంది. అందుకే దీపం వెలిగించడం అంటే, మన జీవితాల్లో వెలుగు, సానుకూలత రావాలని కోరుకోవడం.
ఆధ్యాత్మిక శుద్ధి: ముఖ్యంగా సాయంకాలం దీపం వెలిగించడం వల్ల, రోజు మొత్తం ఇంట్లో పేరుకున్న నెగెటివ్ ఎనర్జీ (ప్రతికూల శక్తి) తొలగిపోయి, పాజిటివ్ ఎనర్జీ (సానుకూల శక్తి) నిండుతుందని నమ్ముతారు. ఇది కేవలం నమ్మకం కాదు, దీపం వెలుగు, దానికి వాడే నూనె లేదా నెయ్యి, వత్తి వలన వచ్చే పొగ వాతావరణాన్ని శుద్ధి చేస్తాయని కూడా చెబుతారు.

ఏకాగ్రత, ప్రశాంతత: దీపపు జ్వాలను కాసేపు చూడటం వల్ల మనస్సు ఏకాగ్రత అవుతుంది, ప్రశాంతత లభిస్తుంది. ధ్యానం చేయడానికి దీపం ఒక గొప్ప సాధనం.
ఇక, దీపం వెలిగించకపోతే అశుభం జరుగుతుందనే భావన గురించి మాట్లాడుకుందాం. నిజానికి, మన సంప్రదాయంలో ఏ ఆచారమూ ‘భయపెట్టడం’ కోసం సృష్టించబడలేదు. మనిషి ఆచారాన్ని తప్పకుండా పాటించడానికి, దాని వల్ల కలిగే ప్రయోజనాలను ప్రతిరోజూ పొందడానికి, కొంత ‘కట్టుబాటు’గా ఈ నియమాలు ఏర్పడ్డాయి.
నిజమైన ఉద్దేశం: ఒక రోజు లేదా కొన్ని రోజులు మీరు అత్యవసర పరిస్థితుల వల్ల లేదా ఇంట్లో లేకపోవడం వల్ల దీపం వెలిగించలేకపోతే, దాని వల్ల ఎలాంటి అశుభం జరగదు. దేవుడు మన హృదయంలో ఉంటాడు, మన నిస్సహాయతను అర్థం చేసుకుంటాడు.
ప్రధానం మనస్సే: దీపం వెలిగించడంలో ప్రధానమైనది దాని వెనుక ఉన్న నిష్కపటమైన ఉద్దేశం, భక్తి. ఆర్భాటం కోసం కాకుండా, మనస్ఫూర్తిగా, శ్రద్ధగా దీపం వెలిగించినప్పుడు మాత్రమే దాని పూర్తి ఫలం లభిస్తుంది. మీరు దీపం వెలిగించకపోయినా మనస్సులో దేవుడిని తల్చుకుంటే అది దీపం వెలిగించినంత పుణ్యమే!
