వెన్నెల్లో ఆడపిల్ల నీవైతే అని రాయాలి అంటే దివ్య భారతి గురించి కానీ శ్రీదేవి గురించి కానీ రాయాలి. పోలిక కాదు కానీ ఒకరు ఉత్తరాది అందం మరొకరు దక్షిణాది అందం.అయినా కూడా మన లోగిళ్లలో చేసిన అల్లరి సందడి, ఒలకబోసిన అభినయం, మనకు పంచిన ప్రేమ ఇవన్నీ ఇవాళ స్మరణీయాలు.
కారణాలు ఏవయినా ఆమె మన మధ్య లేరు. లేని వారి గురించి నివాళి అర్పించడం తప్ప చేయదగింది ఏమీ లేదు. దివ్య భారతి, మరియు శ్రీదేవి లాంటి తారలు గొప్పగా పేరు తెచ్చుకుని తరువాత తీవ్ర విషాదంలో లోకాన్ని ఉంచి తమ దారి తాము చూసుకుని అనంత లోకాలకు చేరుకున్న వారు. కనుక ఈ విషయంలో దైవాన్ని నిందించాలి తప్ప అందుకు కారణం అయిన ఏ ఒక్క వ్యక్తినీ నిందించకూడదు. ఒకవేళ నిందించినా ఒప్పుకుంటారా చెప్పండి.
ఆకాశ వీధిలో ఉన్న తారలతో సమంగా కాంతులీనుతూ ప్రేమను పంచుతూ ఉన్న దివ్య భారతికి ఇవాళ నివాళి. ఆమె తోపాటు శ్రీదేవికి కూడా! కెరియర్ స్పాన్ పరంగా శ్రీదేవి ఎన్నో మెట్లు ఎక్కువ ఆమె కన్నా ! కానీ విషాదంలో మాత్రం ఆమెదీ ఈమెదీ ఒకేస్థాయి. అందుకే లోకాన్ని విడిచిపోయిన వారికి నివాళి ఇవ్వడం అన్నది ఓ బాధ్యత మాత్రమే కానీ విషాదాలకు నివృత్తి ఏమీ ఉండదు. ఉండకూడదు కూడా! ఏవి ఎలా ఉండాలో అలానే ఉండాలి. ఉంచాలి కూడా ! ఆ విధంగా ఉంటేనే మేలు.
ఫస్ట్ కాజ్ :
అందాల తార దివ్య భారతి వర్థంతి
ఈ రోజు అంటే ఏప్రిల్ ఐదు.
ఈ సందర్భంగా బ్యూటీ స్పీక్స్.
బొబ్బిలి రాజా సినిమా లో దివ్య భారతి అందం మతి పొగొడుతుంది. కన్యా కుమారీ కనబడదా దారి పాట ఒక్కటీ చాలు. ఆమెతో బలపం పట్టి మన తెలుగు అక్షరాలు రాయించిన విధంగా ఉంటుంది మరో పాట. ఏ సినిమా చూసినా ఆమె తెలుగు వారే అనుకుంటారు చాలా మంది. అంతగా మన ఇంటి అమ్మాయిగా మారిపోయింది. కుర్రకారుకు ఆ రోజుల్లో ఆరాధ్య దేవత. రౌడీ అల్లుడులో చిరంజీవితో స్టెప్పులు వేసింది, నటనలో శోభనతో పోటీ పడింది. అసెంబ్లీ రౌడీ సినిమాల్లో మోహన్ బాబు సరసన నటించింది. అందమయిన వెన్నెల లోన అచ్చ తెలుగు పడతి ఈమేనా అన్న విధంగా అలరించింది. ఇంకా చాలా మంచి సినిమాలు ఉన్నాయి. వాటి పేర్లు వాటి తీరు ఎలా ఉన్నా కూడా చిన్న నాట ఇటుగా వచ్చి అందరినీ ఆకట్టుకుని అంతే వేగంగా ఈ లోకం నాకేం పని అన్న విధంగా వెళ్లిపోయిన దివ్య భారతి కథ దుఃఖాంతం. ఆమె నటన ఓ జ్ఞాపకం.. అందం ఆచంద్ర తారార్కం.
– బ్యూటీ స్పీక్స్ – మన లోకం ప్రత్యేకం