ప్రస్తుత తరంలో అది ఏ వయసు వారైనా సరే తమ జుట్టు తెల్లబడడం, చుండ్రు ఏర్పడడం, జుట్టు రాలిపోవడం సాధారణంగా మారింది. వాతావరణం వల్లనో, జీవనశైలిలో మార్పుల వల్లనో, మర్ కారణం వల్లనో కానీ జుట్టు సంబంధిత సమస్యలు అందరికీ ఉంటున్నాయి. ఈ సమస్యల నుండి బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరేమో కొన్ని ఆయిల్స్ వాడాలని చెబుతారు. మరికొందరేమో మరిన్ని చెబుతుంటారు. ప్రస్తుతం హెయిర్ కేర్ గురించి తీసుకునే కొన్ని చర్యలు అవసరం లేనివని చర్మ వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
వెంట్రుకల పెరుగుదలకు ఆముదం నూనె
సైంటిఫిక్ గా ఇది నిరూపితం కాలేదు. అదలా ఉంటే ఆముదం నూనె మీ వెంట్రుకలకు ఎలాంటి హాని కలగజేయదు. అలా అని ఆముదం నూనె వల్ల వెంట్రుకలు పెరుగుతున్నట్టు ఎక్కడా నిరూపితం కాలేదు. మీ జుట్టు ఊడిపోవడానికి వైద్య సంబంధిత ఏదైనా కారణం ఉందేమో ముందుగా తెలుసుకోవాలి.
జుట్టు పెరుగుదలకు ఉల్లి రసం
ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టు రాలడానికి కారణమయ్యే అలోపేసియా అరోటా చికిత్సకు ఉపయోగపడుతుంది. ఐతే ఒకవేళ మీ జుట్టు రాలడానికి వేరే ఇతర కారణాలైతే ఉల్లిపాయ రసం కూడా ఎలాంటి మేలు చేయదు. కాబట్టి దానికి సరైన కారణం వెతుక్కోవాలి.
వెంట్రుకలను కత్తిరించడం వల్ల ఎక్కువ పెరుగుతాయి
ఇది పూర్తిగా అబద్ధం. వెంట్రుకలను కత్తిరించడం వల్ల వాటి వేర్లపైన ఎలాంటి ప్రభావం ఉండదు. కాబట్టి జుట్టు ఎక్కువ పెరగడం అనేది ఒక అపోహ. కాకపోతే జుట్టు కత్తిరించుకున్నాక వచ్చే వెంట్రుకలు మెరుస్తుంటాయి కాబట్టి అలా అనిపిస్తుండవచ్చు.
తెల్లవెంట్రుకలను పీకేస్తే ఇంకా పెరుగుతాయి.
ఇది అపోహ మాత్రమే. వెంట్రుకలు తెల్లగా మారడానికి మెలనిన్ సరిగ్గా అందకపోవడమే. అందువల్ల వాటిని పీకేసినంత మాత్రాన తెల్లవెంట్రుకల సంఖ్య పెరగదు.